కరోనా వేళ.. తిరుమలకు ఎంత తక్కువ భక్తులంటే?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Aug 2020 11:07 AM ISTవాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇంకేం సమస్యలు ఉన్నా.. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు అస్సలు వెనుకాడరు. అలంటిది కరోనా కారణంగా ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన పరిస్థితులు తిరుమలలో చోటు చేసుకుంటున్నాయి. లాక్ డౌన్ వేళ.. సుదీర్ఘకాలం పాటు భక్తుల్ని అనుమతించని టీటీడీ.. ప్రభుత్వం ప్రకటించిన అన్ లాక్ మార్గదర్శకాల అనంతరం స్వామివారిని దర్శించుకునే అవకాశం కలిగింది.
గతంలో మాదిరి రోజూ వేలాది మంది స్వామిని దర్శించుకోవటానికి అవకాశం లేకుండా.. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తుల్ని అనుమతిస్తున్నారు. తాజాగా ఎప్పుడూ చోటు చేసుకోని విచిత్రమై అనుభవం టీటీడీకి ఎదురైంది. తరచూ తాము అనుమతించే భక్తుల కంటే ఎక్కువమంది స్వామి వారిని దర్శించుకోవటానికి సిద్ధంగా ఉంటారు. ఇందుకు భిన్నంగా మంగళవారం మాత్రం టీటీడీ విధించిన పరిమితి కంటే తక్కువమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవటం గమనార్హం.
గడిచిన వారంలో ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవటం.. రోజూ పదివేలకు తగ్గని కొత్త కేసుల దెబ్బతో ఏపీ అన్నంతనే వణికిపోతున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనంత భయాందోళనలు ఏపీ వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ఈ ప్రభావం తిరుమల భక్తుల మీద పడింది. మంగళవారం ఒక్కరోజులో తిరుమలను దర్శించుకున్న భక్తులు కేవలం 3962 మాత్రమే. ఇది టీటీడీ అనుమతించాలనుకున్న భక్తుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
ఇలాంటి పరిస్థితి అస్సలు చూడలేదని పలువురు చెబుతున్నారు. గతంలో ఎన్నో సంక్షోభ సమయాల్లోనూ ఇంతకంటే ఎక్కువమంది భక్తులే స్వామివారిని దర్శించుకున్నారని.. ఇంత తక్కువగా ఉండటం తామిప్పటివరకూ చూడలేదంటున్నారు. ఇంత తక్కువగా భక్తులు వచ్చినప్పటికీ స్వామివారి హుండీ ఆదాయం ఫర్లేదన్న మాట వినిపిస్తోంది. రోజు 60వేలకు పైనే భక్తులు స్వామివారిని దర్శించుకునే వేళలో రోజు రెండున్నర కోట్ల వరకూ హుండీ ఆదాయం వచ్చేది. నాలుగువేల కంటే తక్కువమంది భక్తులే స్వామివారి దర్శనం చేసుకున్నా.. హుండీ ఆదాయం మాత్రం రూ.46 లక్షలు రావటం గమనార్హం.