ఫేస్‌బుక్ మీద మరోసారి విరుచుకుపడ్డ కాంగ్రెస్ పార్టీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Aug 2020 7:42 AM IST![ఫేస్‌బుక్ మీద మరోసారి విరుచుకుపడ్డ కాంగ్రెస్ పార్టీ ఫేస్‌బుక్ మీద మరోసారి విరుచుకుపడ్డ కాంగ్రెస్ పార్టీ](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/08/Congress-Writes-To-Mark-Zuckerberg-As-Another-Report.jpg)
ఫేస్ బుక్ సంస్థ బీజేపీకి కొమ్ము కాస్తోందని కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే..! తాజాగా మరోసారి ఇంకో లేఖను రాసింది కాంగ్రెస్ పార్టీ.ఫేస్ బుక్ ఇండియా విభాగం అధికార బీజేపీకి కొమ్ము కాస్తోందంటూ అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఆ లేఖలో మార్క్ జుకర్ బర్గ్ ను ప్రశ్నించింది. బీజేపీ సభ్యుల పోస్టులకు సోషల్ మీడియా ద్వేషపూరిత ప్రసంగ నియమాలు వర్తించవన్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలను కోరింది.
ఫేస్‌బుక్ ఇండియా మరియు అధికార బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో రిలేషన్ ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. భారతదేశంలో మీ కంపెనీ నాయకత్వ బృందంలో కేవలం ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది పక్షపాతంతో, వారి వృత్తిపరమైన ప్రయత్నాలలో అధికార బీజేపీకి అనుకూలంగా ఉన్నారని లేఖలో పేర్కొన్న కాంగ్రెస్.. ఈ విషయాలపై దర్యాప్తు చేయడానికి మీ కంపెనీ ఏ చర్యలు తీసుకుంటుందో మాకు తెలియజేయాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట రాసిన తాజా లేఖలో ఫేస్ బుక్ సంస్థ పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని కోరింది. ఓ విదేశీ సంస్థ దేశంలో సామాజిక సమగ్రతకు భంగం కలిగించడాన్ని సహించలేమని, దీనిపై చట్టపరమైన, న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ లేఖలో స్పష్టం చేసింది.
అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ వాట్సాప్-బీజేపీ లోపాయికారీ ఒప్పందాన్ని బట్టబయలు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వాట్సాప్ ను 40 కోట్ల మంది భారతీయులు ఉపయోగిస్తున్నారు, వాట్సాప్ పేమెంట్స్ సేవలు కూడా అందించాలనుకుంటోంది. అందుకు మోదీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా బీజేపీ వాట్సాప్ పై పట్టు సాధించిందంటూ ఆరోపించారు.
బీజేపీ నేతలను విద్వేష కంటెంట్‌ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసేందుకు ఫేస్‌బుక్ అనుమతిస్తోందన్న వాల్‌స్ర్టీట్ కథనంపై స్పందించాలని కోరుతూ గతం లోనే ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ఆగస్ట్ 14న వాల్‌స్ర్టీట్ జర్నల్‌లో ప్రచురించిన కథనం అనూహ్యమేమీ కాదని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సంతకంతో కూడిన కాంగ్రెస్ లేఖ స్పష్టం చేసింది. ఇప్పటికీ దిద్దుబాటు చర్యలకు సమయం మించిపోలేదని జుకర్‌బర్గ్‌కు రాసిన లేఖలో పేర్కొంది కాంగ్రెస్ పార్టీ.
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాల ద్వారా దెబ్బతీసేందుకు తాము అనుమతించమని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, మితవాద నేతల ద్వేష పూరిత ప్రసంగాలు, అభ్యంతరకర కంటెంట్ ను ఫేస్ బుక్ కావాలనే పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇండియాలో ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ ప్రవర్తనా ధోరణిపై నెల లోగా ఉన్నత స్థాయి విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన వాద కంటెంట్‌ను అనుమతించేందుకు ఎఫ్‌బీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంఖి దాస్ బీజేపీకి మద్దతు పలికారని ఇంతకు ముందు లేఖలో కాంగ్రెస్ ఆరోపించింది.