ఉల్లి రైతుల సాయానికో చిట్టి తల్లి..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  29 Aug 2020 12:26 PM GMT
ఉల్లి రైతుల సాయానికో చిట్టి తల్లి..!

ఉల్లి కోస్తున్నప్పుడు కన్నీళ్లు వస్తే...రైతులకు అమ్మేటపుడు కన్నీళ్ళు వస్తున్నాయి. ఉల్లి రేటు మార్కెట్లో పెరిగినా తరిగినా సగటు రైతుకు ఒరిగేదేమీ ఉండదన్నది నిష్ఠుర సత్యం. తన తండ్రి ఉల్లి సాగులో చవి చూస్తున్న నష్టాలను చిన్నప్పటి నుంచి గమనిస్తున్న ఆ అమ్మాయి ఎలాగైనా ఆ కష్టాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించుకుంది. ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం తప్పకుండా ఉంటుందని గాఢంగా నమ్మిన ఆ అమ్మాయి, ఉల్లి సాగు చేస్తున్నప్పుడు...చేశాక నష్టాలనుంచి బైట పడాలంటే ఏం చేయాలో అని ఆలోచించింది. మరి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోగలిగిందా??

కల్యాణి షిండే...23 ఏళ్ళ ఈ అమ్మాయిది మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌ పుట్టినూరు. లాసల్‌గావ్‌లో అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ ఉంది. మహారాష్ట్ర ఉల్లి సాగులో అగ్రస్థానంలో ఉంది. అయితే ఉల్లి సాగు చేస్తే బంగారం సాగు చేసినట్లే అనుకోడానికి వీల్లేదు. సాగులో నష్టాలు వస్తే ఇక అంతే సంగతులు. అరుగాలం శ్రమించిందంతే మట్టిపాలే! అందుకే ఉల్లి రైతులకు పంటపై భరోసా చాలా తక్కువ. పంట చేతికందేవరకు ఓ టెన్షన్‌ ఉంటే...అందాక గిట్టుబాటు ధరలదాకా ఎదురు చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ నిల్వ ఉంచితే అవి కుళ్ళి అసలుకే ఎసరు తెస్తాయి. అందుకే రైతులు పెద్దగా లాభాలు ఆశించకుండా అయినకాడికి అమ్ముకునేస్తారు. పెట్టుబడి అయినా వస్తుందా అంటే గ్యారెంటా ఉండదు. ఉల్లి రైతుల దీనావస్థను చిన్న నాటి నుంచి చూస్తూ పెరిగిన కల్యాణి ఎలాగైనా ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుక్కోవాలని గట్టిగానే అనుకుంది.

ఉల్లి సాగు మిగిలిన పంటల సాగులా కాదు. దీనిపై నమ్మకం పెట్టుకోలేం. మార్కెట్‌ ఫ్లక్చువేషన్‌ చాలానే ఉంటుంది. దాదాపు 800 శాతం దాకా ఉంటుంది. అదే ద్రాక్ష రైతు పరిస్థితి వేరు. తను ఎంత విస్తీర్ణంలో ద్రాక్ష సాగు చేస్తున్నాడు...ఎంతమేరకు ఆదాయం లభిస్తుంది అనే విషయంగా అతనికి స్పష్టత ఉంటుంది. కానీ ఉల్లి రైతు అలా అంచనా వేయలేదు. ఇది ఓ జాక్‌పాట్‌ లాంటిది. వస్తే లాభాల పంట...లేదా నష్టాల మంట అనేలా ఉంటుంది. అయినా ఉల్లి రైతులు నష్టాన్ని భరించి ఈ పంటనే సాగు చేస్తుంటారు. ఎప్పటికైనా లాభాలు రాక పోతాయా...తమ నష్టాలు, కష్టాలు తీరక పోతాయా అని ఆశతో ఎదురు చూస్తుంటారు. ఈ దీనగాధలు కల్యాణి గుండెను కదలించాయి.

కల్యాణి బీటెక్‌ ఫైనల్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఫౌండేషన్‌ వాళ్ళు నిర్వహిస్తున్న డిజిటల్‌ ఇంపాక్ట్‌ స్క్వేర్‌ కార్యక్రమంలో పాల్గొంది. అది ఆ సంస్థ చేపడుతున్న ఓ ఇంకుబేషన్‌ సెంటర్‌. అక్కడే ఆమె చిరకాల సమస్యకు సూత్రప్రాయంగా ఓ పరిష్కారం దొరికింది. ఐఓటీ సాంతకేతికత ద్వారా కుళ్ళిపోయిన ఉల్లిపాయల నుంచి వచ్చే వాయువును గుర్తించడం, వాతావరణాన్ని మానిటర్‌ చేయగల సాంకేతికతను సిద్ధం చేసుకుంది. దాన్ని పరికరంగా మార్చి 2018లో గోదామ్‌ ఇన్నోవేషన్‌ పేరిట అగ్రి స్టార్టప్‌ షురూ చేసింది.

ఈ స్టార్టప్‌ ప్రారంభానికి ముందు కల్యాణి చాలా హోమ్‌వర్కే చేసుకుంది. మొదట పల్లెల్లో తిరిగి ఉల్లి నిల్వ చేసేందుకు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరంగా తెలుసుకుంది. వారు అనుసరించే నిల్వ పద్ధతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఉల్లి నిల్వల్లో పాడైన వాటిని గుర్తించడంలో పాత పద్దతుల్ని పాటిస్తుండటం వల్ల ఉల్లి రైతులకు నష్టం ఎక్కవగా వాటిల్లే ప్రమాదముందని తెలుసుకుంది. ఇప్పటి దాకా ఇలాంటి మార్గాలను అమలు చేయడం వల్లే ఉల్లి రైతులు నష్టపోతున్నారని గుర్తించింది. ఇక కమ్యూనిటీ గిడ్డంగులకు తనే వెళ్ళి ఐవోటీ ద్వారా పర్యవేక్షణ విధానాన్ని క్షేత్ర స్థాయిలో తెలుసుకుంది.. ఈ సాంకేతికత సాయంతో ఉల్లి స్థితిగతుల్ని ముందస్తుగా తెలుసుకోవచ్చని తద్వారా నష్టాలను అరికట్టవచ్చని కల్యాణికి పూర్తిగా అర్థమైంది.

ఈ ఐవోటీని అమలు చేయడానికి కల్యాణి తన సొంత సైన్యాన్ని తయారు చేసుకుంది. వీరు ముందుగా రైతుల వద్దకు వెళ్ళి విషయాలు సేకరిస్తారు. ఉల్లి ఎంత సాగు చేశారు. పంట ఎంత చేతికి వచ్చిందో తెలుసుకుంటారు. ఆ తర్వాత రైతులు సొంతంగా నిల్వ చేయాలనుకుంటున్నారా? లేదా కమ్యూనిటీ గిడ్డంగుల ద్వారా నిల్వ చేయాలనుకుంటున్నారో అడిగి వివరాలు సేకరిస్తారు. స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి పరికరాలను వేర్వేరు చోట్ల ఏర్పాటు చేస్తారు. ఉల్లి నిల్వల్ని తాజాగా ఉంచడానికి అనువైన వాతావరణం కోసం గిడ్డంగుల్లో వెంటిలేషన్‌తోపాటు ఉష్ణోగ్రతల్ని నియంత్రిస్తారు. ఈ పరికరాల్లో ఉండే సెన్సర్లు పాడైన ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే గ్యాస్‌ను గుర్తిస్తాయి. దీంతో సులువుగా కుళ్ళిన వాటిని నిల్వ నుంచి వేరు చేస్తారు. సాధారణంగా ఉల్లి సాగు చేసి పంట చేతికందడానికి 120 రోజుల వ్యవధి పడుతుంది. ఆ తర్వాత గిడ్డంగుల్లో కనీసం ఎనిమిది నెలలు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఒక రైతు 10 కేజీల ఉల్లిపాయల్ని నిల్వ చేస్తే మార్కెట్‌కు తరలించేలోగా కనీసం 40 నుంచి 50 శాతం ఉల్లి పాడై ఉంటుంది. ఈ నష్టాన్ని పూడ్చడానికే కల్యాణీ సాంకేతికతను అందిపుచ్చుకుంది.

నాసిక్‌ రైతులతో కలిసి పనిచేయడం ప్రారంభించిన కల్యాణి ప్రస్తుతం వ్యక్తిగత సామూహిక గిడ్డంగులకు సాంకేతిక సేవలందిస్తోంది. టాటా స్టీల్‌ భాగస్వామ్యంతో సోలార్‌ ఎనర్జీ సాయంతో కమ్యూనిటీ గిడ్డంగిని నిర్వహిస్తోంది. ఉల్లి నిల్వ చేసినందుకు రూ.5వేలు నుంచి రూ.10వేల దాకా అద్దె తీసుకుంటోంది. అదే సొంతంగా పరికరం ఏర్పాటు చేయాలంటే లక్ష నుంచి రూ.లక్షాయాభైవేల దాకా ధర ఉంటుంది. ప్రస్తుతం కల్యాణీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆనియన్‌ అండ్‌ గార్లిక్‌ రీసెర్చి, నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నాబార్డ్‌లతో కలిసి పనిచేస్తోంది.

ఉల్లి రైతుగా తండ్రి పడుతున్న కష్టాలను గమనించిన కల్యాణీ ఆ సమస్యకు ఎలాగైనా పరిష్కారం సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేసి ఈరోజు ఓ యువ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగింది.

Next Story