ఈ టైంలో మోదీ మీద ఆ టోన్ ఏంది సోనియమ్మ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jun 2020 7:35 AM GMT
ఈ టైంలో మోదీ మీద ఆ టోన్ ఏంది సోనియమ్మ?

సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఏమిటన్నది ఆలోచించటం ఒక ఎత్తు అయితే.. దాన్ని మరింత చిక్కుముడులు వేసేలా చేసే వ్యాఖ్యలు అన్ని సందర్భల్లోనూ కలిసి రావు. ఆ విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. ఆమె పుత్రరత్నం రాహుల్ మర్చిపోతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. చైనా కుయుక్తితో భారత సైనికులు ఇరవై మంది ప్రాణ త్యాగం చేసిన వేళ.. యావత్ జాతి మొత్తం ఒక్కటవుతుంటే.. అందుకు భిన్నంగా కాంగ్రెస్ అగ్రనేతల టోన్ ఉండటం గమనార్హం.

ఎక్కడి దాకానో ఎందుకు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని చూస్తే.. కాంగ్రెస్ లో మిస్ అవుతున్నదేమిటో ఇట్టే అర్థమవుతుంది. ఇవాల్టి రోజున ప్రధాని మోడీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఘాటు విమర్శలు చేయాల్సి వస్తే.. అది కేసీఆర్ కు మాత్రమే సాధ్యం. కేసీఆర్ నోటి నుంచి వచ్చే ప్రశ్నలకు బీజేపీ నేతలు మౌనం దాల్చటం చూస్తే విషయం అర్థమవుతుంది.

అలాంటిది.. చైనా ఎపిసోడ్ పై తమ పూర్తి సహాయ సహకారాల్ని కేంద్రానికి అందిస్తామని చెప్పటమే కాదు.. దెబ్బకు దెబ్బ తప్పదన్నట్లుగా ఉన్న కేసీఆర్ మాటలకు భిన్నంగా కాంగ్రెస్ అధినాయకత్వం మాటలు ఉండటాన్ని మర్చిపోకూడదు. చైనా సేనలు భారత భూభాగంలోకి ఎలా చొచ్చుకొచ్చాయో ప్రధాని మోడీ దేశ ప్రజలకు చెప్పాలని సోనియా గాంధీ డిమాండ్ చేయటం వల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న?.

లద్దాఖ్ లో భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా సేనల చేతిలో ఇరవై మంది భారత సైనికులు వీర మరణం ఎందుకు పొందాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలని సోనియా.. ఆమె తనయుడు రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచన.. వ్యూహం ఏమిటో చెప్పాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీని ప్రశ్నించే కన్నా.. చైనా దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ.. వారికి ఘాటు హెచ్చరికలు చేయటాన్ని దేశ ప్రజలు కోరుకుంటారు.

అలాంటి వ్యాఖ్యలు పార్టీకి మేలు చేస్తాయన్నది సోనియా.. రాహుల్ గుర్తిస్తే మంచిది. అందుకు భిన్నంగా వ్యవహరించటం వల్ల రాజకీయంగా వచ్చే లాభం లేకపోగా.. ప్రజల్లోనూ పలుచన అవుతారన్నది మర్చిపోకూడదు. మోడీపై విమ‌ర్శ‌నాత్మ‌క‌ రీతిలో మాట్లాడటం కాంగ్రెస్ కు నష్టాన్ని కలుగుజేస్తుందన్న విషయాన్ని ఆపార్టీ అధినాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story