రెచ్చ‌గొడితే దీటైన జ‌వాబుకు ఎల్ల‌ప్పుడూ సిద్ధం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2020 1:37 PM GMT
రెచ్చ‌గొడితే దీటైన జ‌వాబుకు ఎల్ల‌ప్పుడూ సిద్ధం

సోమవారం లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత్ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ విష‌య‌మై ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. భారత్ శాంతిని కోరుకుంటోందని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దీటైన‌ రీతిలో బదులిస్తుందని అన్నారు. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.

దేశ రక్షణలో భాగంగా అమరులైన సైనికుల త్యాగాలు వృథా కావని, దేశం వాటిని తప్పక గుర్తుపెట్టుకుంటుందని మోదీ అన్నారు. ఈ మేరకు కరోనాపై సమీక్షలో భాగంగా రాష్ట్రాల సీఎంల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్‌ షా, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వృథా కావని.. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీ లేదు. భారత్ శాంతిని కోరుకుంటుంది. అయితే.. కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం.. దీటైన‌ రీతిలో బ‌దులిచ్చే సత్తా భారత్‌కు ఉందని మోదీ చైనానుద్దేశించి వ్యాఖ్యానించారు.

మేము ఎవరినీ రెచ్చగొట్టలేదని ఈ సంద‌ర్భంగా మోదీ అన్నారు. సమయం వచ్చిన ప్రతిసారీ దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని రక్షించడంలో మా సత్తా, సామర్థ్యాలను నిరూపించుకున్నామ‌ని తెలిపారు. త్యాగాలు, వెనకడుగు వేయకపోవడం, ధైర్యసాహసాలు మన జాతి లక్షణాలంటూ మోదీ ఉద్వేగంగా అన్నారు.

ఇదిలావుంటే.. భారత్‌-చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 19న‌ ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్ర‌క‌టించింది.

Next Story
Share it