బీజేపీ విషయంలో సరైన చర్యలు ఎందుకు లేవు.. మార్క్ జూకర్ బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ లేఖ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 11:42 AM GMT
బీజేపీ విషయంలో సరైన చర్యలు ఎందుకు లేవు.. మార్క్ జూకర్ బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ లేఖ..!

బీజేపీ నేతలను విద్వేష కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేసేందుకు ఫేస్‌బుక్‌ అనుమతిస్తోందన్న వాల్‌స్ర్టీట్‌ కథనం ఇప్పుడు భారతదేశంలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. బీజేపీ నేతలు ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఫేస్ బుక్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. దీనికి సమాధానం చెప్పాలని ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది.

ఆ లేఖను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఆగస్ట్‌ 14న వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌లో ప్రచురించిన కథనం అనూహ్యమేమీ కాదని పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ సంతకంతో కూడిన కాంగ్రెస్‌ లేఖ స్పష్టం చేసింది. ఇప్పటికీ దిద్దుబాటు చర్యలకు సమయం మించిపోలేదని జుకర్‌బర్గ్‌కు రాసిన లేఖలో పేర్కొంది కాంగ్రెస్ పార్టీ.

ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కె.సి. వేణుగోపాల్ రాసిన లెటర్ లో ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ లు చేస్తున్న తప్పులను ఎత్తి చూపించారు. ఫేస్ బుక్ ఇండియా లీడర్ షిప్.. బీజేపీకి వత్తాసు పలుకుతోందని అందులో ఆరోపించారు. హై లెవెల్ ఎంక్వయిరీ విధించాలని.. వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని కోరుతూ ట్వీట్లు చేశారు.

భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాల ద్వారా దెబ్బతీసేందుకు తాము అనుమతించమని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, మితవాద నేతల ద్వేష పూరిత ప్రసంగాలు, అభ్యంతరకర కంటెంట్ ను ఫేస్ బుక్ కావాలనే పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇండియాలో ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ ప్రవర్తనా ధోరణిపై నెల లోగా ఉన్నత స్థాయి విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాలని లేఖను వెల్లడిస్తూ రాహుల్‌ పేర్కొన్నారు. హేట్‌ స్పీచ్‌ పాలసీకి విరుద్ధంగా భారత్‌లో పాలక బీజేపీకి ఫేస్‌బుక్‌ మద్దతును ఇచ్చిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది.

విభజన వాద కంటెంట్‌ను అనుమతించేందుకు ఎఫ్‌బీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంఖి దాస్‌ బీజేపీకి మద్దతు పలికారని ఈ లేఖలో కాంగ్రెస్‌ ఆరోపించింది. హింసను ప్రేరేపించే విషయాలను బీజేపీ చెప్పినా కూడాఫేస్ బుక్ వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

ప్రజల మత ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించారని పేర్కొంటూ ఫేస్‌బుక్‌ పాలసీ చీఫ్‌(భారత్‌) అంఖి దాస్‌పై కేసుపై నమోదైంది. భారత్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను పాలక బీజేపీ, ఆరెస్సెస్‌ నియంత్రిస్తున్నాయని రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసిందే..! పక్షపూరితమైన, ద్వేషపూరిత ప్రసంగాలను, వ్యాఖ్యలను మ్యానిప్యులేట్ చేయడాన్ని తాము అనుమతించబోమని, ప్రజలంతా ఫేస్ బుక్ తీరును ప్రశ్నించాలని రాహుల్ గాంధీ కోరారు.

Next Story
Share it