'ఈ-రక్షాబంధన్'‌ను ప్రారంభించిన సీఎం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2020 4:04 PM IST
ఈ-రక్షాబంధన్‌ను ప్రారంభించిన సీఎం

రాష్ట్రంలోని మహిళలు, బాలల భద్రత కోసం పోలీస్‌ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్‌’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ నాడు సైబర్‌ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్‌ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్‌ ఉమెన్‌కు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు.

సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్‌, యానిమేషన్స్‌, రీడింగ్ మెటీరియల్‌ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా అక్కాచెల్లెమ్మలకు ఏదైనా సమస్య ఉంటే దిశ యాప్‌, దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలావుంటే.. 'ఈ- రక్షాబంధన్'‌ ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మేక‌తోటి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజిని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఉషా శ్రీ చరణ్, మాల కార్పొరేషన్ ఛైర్మన్ అమ్మాజీ, పలువురు విద్యార్ధినులు, మహిళలు సీఎం జగన్‌కు రాఖీ కట్టారు.

Next Story