కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు, అల్లర్లు, హింసాత్మక ఘటనలతో  ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ చట్టం వల్ల ఈశాన్య రాష్ట్రాలతో పాటు, దేశమంతట ఇంకా ఆందోళనలు, అల్లర్లు కొనసాగుతున్నాయి. ఒక దశలో ఆందోళనకారులు పోలీసులపై కూడా తిరగబడ్డారు. ఈ ఘటనల కారణంగా రైల్వే శాఖకు ఎంత నష్టం వాటిల్లిందో అధికారులు అంచనా వేశారు. తాజాగా  రైల్వే అధికారుల లెక్కల ప్రకారం కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు,అల్లర్లు,హింసాత్మక ఘటనల వల్ల  రైల్వే శాఖకు దాదాపు రూ. 90 కోట్ల మేర నస్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగల్‌లో దాదాపు 70 శాతం వరకు రైల్వే ఆస్తులు ధ్వంసం అయ్యాయని అధికారులు గుర్తించారు.

కాగా, అక్కడ దాదాపు రూ.72.19 కోట్ల వరకు వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా రైల్వే ఆస్తుల నష్టంపై పౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు రూ.12 కోట్లకుపైగా నష్టం రాగా, నార్త్‌ ఈస్ట్రన్‌  రైల్వేకు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రైల్వే పోలీసుల ద్వారా సమాచారం. ఈ హింసాత్మక ఘటనల కారణంగా రైల్వే పోలీసులు 80 వరకు ఎఫ్‌ఐఆర్‌ కేసులు నమోదు చేసినట్లు రైల్వే పోలీసు డీజీ అరుణ్‌కుమార్‌ ప్రకటించారు. ఆందోళనకారుల దాడుల్లో 12 మంది రైల్వే ఉద్యోగులకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఘటనలకు పాల్పడిన వారిని త్వరలో గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.