అప్పుడొకలా.. ఇప్పుడు మరోలా.. చర్చనీయాంశంగా బాబు తీరు.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2020 4:30 PM ISTవిశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వైసీపీ సర్కార్‌కు సవాల్ ల సవాళ్లు విసిరి హడావుడి చేసిన చంద్రబాబునాయుడు.. నిన్న జరిగిన విజయవాడ రమేష్ హాస్పిటల్ ఘటనపై మాత్రం కేవలం సంతాపానికే పరిమితమయ్యారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి విశాఖకు వస్తామంటే అనుమతులు ఇవ్వట్లేదంటూ.. హైదరాబాద్ లో కూర్చుని వైసీపీ సర్కార్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన చంద్రబాబు స్వర్ణా ఫ్యాలెస్ ఘటనపై మాత్రం మిన్నకుండిపోయారు.
చంద్రబాబు మౌనం వెనుక ఏమైనా కారణాలున్నాయా.? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయ చదరంగంలో అపర చాణిక్యుడిగా పేరొందిన చంద్రబాబు.. తాను నిర్మించతలపెట్టిన అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారడం.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తరుణంలో.. ఆ ప్రాంతంలోనే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరగడంతో ప్రభుత్వంపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీ వర్గాలు నానా రభస చేశారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో విపత్తు జరిగిన ప్రాంతంలో పర్యటించి బాధితుల పక్షాన నిలబడితే పరువాలేదు గానీ.. జగన్ సర్కార్ విశాఖ విషయంలో తీసుకున్న నిర్ణయం తనకు మింగుడుపడకపోవడం.. విశాఖ రాజధానిగా అనువైన ప్రాంతం కాదు అనే చెప్పే ప్రయత్నాలు చేయడం.. జగన్ తనకు కొరకరాని కొయ్యలా తయారవుతున్నాడని అక్కసును వెల్లబుచ్చే ప్రయత్నం మాత్రమే జరిగిందనేది విమర్శకుల వాదన.
స్వర్ణా ఫ్యాలెస్ ఘటన బాబు కలలు గన్న రాజధాని ప్రాంతం అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో జరగడం.. హాస్పిటల్ యజమాని పోతినేని రమేష్ బాబు తన వర్గం కావడంతోనే బాబు గారు విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనప్పుడు చేసినంత హడావుడి ఇప్పుడు చేయట్లేదనే వాదన వినిపిస్తోంది.
హాస్పిటల్ యాజమాని పోతినేని రమేష్ బాబు.. చంద్రబాబు కొవిడ్‌పై నిర్వహించే వెబినార్‌లలో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసిన వీడియోలు వైరల్ అవుతున్న నేఫథ్యంలో.. తాను నడిపిస్తున్న ఆసుపత్రి పట్ల ఎందుకు అంత అశ్రద్ధగా ఉన్నారు..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నేను మీ అందరి వాడిని అని పదేపదే మైకుల ముందు గంటల తరబడి స్పీచులు ఇచ్చే చంద్రబాబు.. తనకు కావాల్సిన వ్యక్తికి సంబంధించిన సంస్థ కాబట్టే.. విజయవాడ ఘటన విషయంలో ఒకలా.. విశాఖ బాధితుల విషయంలో మరోలా.. టోను వినిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.