Fact Check : హైదరాబాద్ లో గాలికి హోర్డింగ్ పడి యువకుడు మరణించాడన్న వార్త నిజమా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Aug 2020 7:17 PM ISTఈదురుగాలులకు ఓ హోర్డింగ్ మోటార్ సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి మీద పడ్డ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో వచ్చిన భారీ వర్షాలకు, ఈదురుగాలులకు హైదరాబాద్, మెహదీపట్నంలో ఓ హోర్డింగ్ ఎగిరి బైక్ మీద వెళుతున్న ఓ వ్యక్తిపై పడడంతో అతడు మరణించాడని పలువురు పోస్టులు పెడుతున్నారు.
ఆ వీడియో ఫేస్ బుక్ లో కూడా వైరల్ అవుతోంది.
9tv news అనే ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ వీడియోను పోస్టు చేశారు. మెహదీపట్నంలో చోటుచేసుకున్న ఘటన కారణంగా ఓ వ్యక్తి మరణించాడని అందులో తెలిపారు.
ఫేస్ బుక్ లో ఈ వీడియోను న్యూస్ మీటర్ అందుకుంది. ఈ వార్త ఎంత వరకూ నిజం అన్న దానిపై సరైన సమాచారం ఇవ్వాలంటూ కోరారు.
నిజ నిర్ధారణ:
మెహదీపట్నం ఫ్లై ఓవర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది అన్నదాన్లో ఎటువంటి నిజం లేదు.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పాకిస్థాన్ కు చెందిన మీడియా సంస్థలు ఈ ఘటనపై వార్తలను ప్రచురించాయి. ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో ఆగష్టు 7, 2020న చోటుచేసుకుందని పాకిస్థాన్ మీడియా సంస్థలు తెలిపాయి.
విపరీతమైన గాలి రావడంతో బిల్ బోర్డు పడిపోయింది. మెట్రోపోల్ హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వాహనదారులు గాయపడ్డారు.
ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. విపరీతమైన గాలులకు హోర్డింగ్ రోడ్డు మీదకు రావడం.. మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తున్న వారి మీద పడడం జరిగిపోయింది. కింద పడిన వ్యక్తులకు సహాయం చేయడానికి పలువురు రావడం కూడా వీడియోలో గమనించవచ్చు.
మెహదీపట్నం ఫ్లై ఓవర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందో అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'నిజం లేదు'. ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో ఆగష్టు 7, 2020న చోటుచేసుకుంది.