Fact Check : రష్యా తీసుకుని వచ్చిన వ్యాక్సిన్ ను వేసుకున్న ఆ యువతి పుతిన్ కుమార్తేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 1:15 PM GMT
Fact Check : రష్యా తీసుకుని వచ్చిన వ్యాక్సిన్ ను వేసుకున్న ఆ యువతి పుతిన్ కుమార్తేనా..?

రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కరోనాకు వ్యాక్సిన్ తీసుకుని వచ్చామని ప్రకటించేశారు. ఆగష్టు 11న పుతిన్ మాట్లాడుతూ తాము కరోనాకు వ్యాక్సిన్ ను తీసుకుని వచ్చామని.. అది అద్భుతంగా పని చేస్తోందని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

వ్యాక్సిన్ ఎంతో ప్రభావంతమైనదని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు పుతిన్. తన కుమార్తెలలో ఒకరు ఈ వ్యాక్సిన్ ను వేయించుకున్నారని అన్నారు. ఇంతకూ ఏ కుమార్తెకు వ్యాక్సిన్ ను వేశారు అన్నది చెప్పలేదు. తొలిసారి ఆమెపై టీకాను ప్రయోగించాక శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరిందని.. తర్వాతి రోజు 37 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది.. ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. రెండో టీకా తర్వాత కూడా ఆమె ఆరోగ్యం బాగుంది. ఆమె శరీరంలో సమృద్ధిగా యాంటీబాడీలు ఉత్పత్రి అయ్యాయని పుతిన్ తెలిపారు.

ఆయన అలా అన్నారో లేదో వ్యాక్సిన్ వేయించుకుంటున్న వాలంటీర్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

“President Putin’s daughter has been tested for the drug #RussianVaccine #CoronavirusVaccine #CoronaVaccine” అంటూ పలువురు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కుమార్తె మీద వ్యాక్సిన్ ను ప్రయోగించారని పలువురు ట్వీట్లు చేస్తూ ఉన్నారు.

ప్రెసిడెంట్ పుతిన్ కుమార్తె కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్న మొట్టమొదటి వ్యక్తి అంటూ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న అమ్మాయి పుతిన్ కుమార్తె కాదు.

మొదట గూగుల్ లో పుతిన్ కుమార్తెలకు సంబంధించిన సమాచారాన్ని వెతకగా. మరియా ఒరొంత్సోవా, ఎకెతెరీనా పుతినా అన్న పేర్లు కనిపించాయి.

1

వారి ఫోటోలను వెతకగా.. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న అమ్మాయికి పుతిన్ ఇద్దరు కుమార్తెలకు ఎటువంటి మ్యాచ్ అవ్వలేదు.

వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను ఉపయోగించి చూడగా పలు వీడియోలు కనిపించాయి. ఓ వీడియోలో ఆమెకు సంబంధించిన సమాచారం లభించింది. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న అమ్మాయి పేరు నటాలియా.. ఆమె వాలంటీర్ అని తెలిపింది. మిలటరీ డాక్టర్ అవ్వాలని నటాలియా ప్రయత్నిస్తోంది.

N

కిరోవ్ మిలిటరీ మెడికల్ అకాడెమీలో చదువుకుంటోంది. ఆమె ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలదు. మెరీన్ స్పోర్ట్స్ లో ఆల్ రౌండర్ గా నిలిచిన ఆమె ఎన్నో పోటీలలో పాల్గొని ప్రైజులను సొంతం చేసుకుంది.

ఎన్నో మీడియా సంస్థలు పుతిన్ కుమార్తె వ్యాక్సిన్ చేయించుకుందని కథనాలను ప్రచురించాయి. కానీ ఏ కూతురు అన్న విషయాన్ని వెల్లడించలేదు.

వ్యాక్సిన్ వేయించుకున్నది రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కుమార్తె అంటూ వైరల్ అవుతున్న పోస్టులు నిజం కాదు. వీడియోలో ఉన్నది వాలంటీర్ నటాలియా.

Next Story