అప్పుతీర్చ‌లేద‌ని బాధితుడి భార్య‌ను బంధించిన వ‌డ్డీ వ్యాపారి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 April 2020 4:12 AM GMT
అప్పుతీర్చ‌లేద‌ని బాధితుడి భార్య‌ను బంధించిన వ‌డ్డీ వ్యాపారి

ఓ వైపు క‌రోనాతో యావ‌త్ ప్ర‌పంచం కుదేల‌వుతుంటే.. మ‌రోవైపు దారుణాలు మాత్రం త‌గ్గ‌ట్లేదు. అప్పు తీర్చ‌లేద‌ని దారుణానికి ఒడిగ‌ట్టాడు ఓ వ‌డ్డీ వ్యాపారి. వివ‌రాళ్లోకెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండ‌లం సులానగర్‌కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్య‌క్తి.. అదే గ్రామానికి చెందిన బానోత్ హన్మా అనే వ్య‌క్తి వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న 2 లక్ష‌ల‌లో ఈ మ‌ధ్య‌నే రూ.1.50 లక్షలు కూడా చెల్లించాడు. మిగిలిన డ‌బ్బు త్వరలోనే చెల్లిస్తాన‌ని హ‌న్మాకు చెప్పాడు.

అయితే.. కరోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టంతో మిగిలిన రూ. 50వేలు, వడ్డీ స‌కాలంలో చెల్లించ‌లేక‌పోయాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేఫ‌థ్యంలో త్వరలోనే ఇచ్చేస్తాన‌ని, కొద్దిపాటి గ‌డువు కావాల‌ని వ‌డ్డీ వ్యాపారి హన్మాను కోరాడు. ఒప్పుకోని వ్యాపారి హ‌న్మా డబ్బులు చెల్లించాల్సిందేన‌ని మొండికేసి.. హ‌ట్యా ఇంటి వ‌ద్ద గొడ‌వ చేస్తూ అతడిపై దాడికి దిగాడు.

భ‌ర్త‌పైకి దాడి చేస్తుండ‌టంతో భార్య అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఆవేశంలో మ‌హిళ అని కూడా చూడ‌కుండా ఆమెపైనా దాడికి పాల్ప‌డ్డాడు. అంత‌టితో శాంతించ‌క‌ బాధితురాలిని తన ఇంటికి లాక్కెళ్లి బంధించాడు. దీంతో హ‌ట్యా.. టేకులపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క‌రోనాతో ఏర్ప‌డిన విప‌త్క‌ర ప‌రిస్థితుల దృష్ట్యా లావాదేవీల విష‌యంలో చూసీచూడ‌న‌ట్టు పోవాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతున్నా ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం దారుణం.

Next Story