బెంగళూరు హింసాత్మక ఘటనలో పాల్గొంది 3000 మందట.. స్పందించిన కేటీఆర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 8:11 AM GMT
బెంగళూరు హింసాత్మక ఘటనలో పాల్గొంది 3000 మందట.. స్పందించిన కేటీఆర్

మంగళవారం రాత్రి బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కారణంగా వివాదం పెద్దదై.. అల్లర్లకు దారి తీసింది. మైనారిటీలను కించపరిచే విధంగా సదరు ఎమ్మెల్యే బంధువు పోస్టు పెట్టడంతో ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు పలు సంచలన విషయాలను వెల్లడించారు. బెంగళూరులోని డీజేహళ్లి, కేజీహళ్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో హింసాత్మక ఘటన వెనుక భారీ ప్రణాళిక ఉందని పోలీసులు చెబుతున్నారు.ఆగష్టు 5 నుంచి కుట్రకు ప్రణాళిక వేశారని.. ఘర్షణల్లో దాదాపు 3000 మంది పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. అల్లర్ల వెనుక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉందని చెబుతున్న పోలీసులు.. ఎస్‌డీపీఐ నేత ముజామ్మిల్‌ బాషాను ఏ1గా చెబుతున్నారు. ఈ ఘటనలో 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని కర్ణాటక పోలీసులు తెలిపారు.

బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమీషనర్ జిఎన్ శివమూర్తి ధ్వంసమైన డీజే హళ్లి పోలీసు స్టేషన్ ను చూసొచ్చారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. పరిస్థితి చేయి దాటిపోతోందనే కారణంతోనే పోలీసులు కాల్పులు జరిపారని శివమూర్తి తెలిపారు. మంగళవారం నాడు మొదలైన హింస.. బుధవారం తెల్లవారుజామున వరకూ కొనసాగిందని స్థానికులు తెలిపారు.

హింసకు పాల్పడిన వారు గంజాయి కూడా కొట్టినట్లు గుర్తించారు. మొదట లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు, ఆ తర్వాత టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతోనే ఫైర్ ఓపెన్ చేశామని పోలీసులు చెబుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఎమ్మెల్యే ఇంటి మీద దాడిని ఖండించారు. హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని.. పోలీసులకు అన్ని అధికారాలు ఇచ్చామని అన్నారు. క్రిమినల్స్ ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టే విధంగా ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయడంతో ఈ గొడవ మొదలైంది.

ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. సోషల్ మీడియా యూజర్లు తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని సూచించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ద్వారా ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. 'సామాజిక మాధ్యమాల్లో చేసే నకిలీ ప్రచారం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలను వాడే వాళ్లు బాధ్యతగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇటువంటి ప్రచారాలు చేయొద్దు, నకిలీ వార్తలను ప్రచారం చేయడం ఆపండి. అసాంఘిక చర్యలను రెచ్చగొట్టే సాధనంగా సామాజిక మాధ్యమాలను వాడొద్దు' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story