బెంగళూరులో మంగళవారం రాత్రి ఏమి జరిగింది.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 6:45 AM GMT
బెంగళూరులో మంగళవారం రాత్రి ఏమి జరిగింది.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి

మంగళవారం రాత్రి సమయంలో బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కారణంగా వివాదం పెద్దధై.. అల్లర్లకు దారి తీసింది. మైనారిటీలను కించపరిచే విధంగా సదరు ఎమ్మెల్యే బంధువు పోస్టు పెట్టడంతో ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై కొందరు దాడి చేశారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ క్షణాల్లోనే పరిస్థితుల్లో చాలా మారిపోయాయి.

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టే విధంగా ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేశాడు. ఓ వర్గానికి చెందిన వారు గత రాత్రి కావల్‌ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ఎమ్మెల్యే ఇంటి లోకి ప్రవేశించిన వ్యక్తులు పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించారు. బయట ఉన్న కార్లను వాహనాలను ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర రోడ్డు మీద ఉన్న వాహనాలను కూడా తగులబెట్టారు. దేవరజీవనహళ్లి పోలీసు స్టేషన్ ను కూడా ధ్వంసం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు చేరుకోవడంతో ఆందోళనకారులు పోలీసు వాహనాలకు కూడా నిప్పంటించారు.దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

డీజేహళ్లి, కేజీహళ్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆందోళనకారులు రెండు ఏటీఎంలను కూడా ధ్వంసం చేశారు. ఎస్పిడిఐ నేత ముజామిల్ పాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను రెచ్చగొట్టింది ఆయనేనని అనుమానిస్తూ ఉన్నారు. ఏ-1 ముద్దాయిగా పోలీసులు ముజామిల్ పాషా మీద కేసు పెట్టారు.

వివాదాస్పద పోస్టు పెట్టిన నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఫోన్ ను కొద్దిరోజుల కిందట కొట్టేశారని.. ఆ కామెంట్లు నేను చేయలేదని నవీన్ చెబుతూ ఉన్నారు. మనోభావాలు దెబ్బతీసే కామెంట్లు తాను చేయలేదని చెబుతూ ఉన్నాడు.

Next Story
Share it