ఆ వివాదాస్పద ఎంపీకి పాకిస్థాన్ నంబర్ల నుండి బెదిరింపులట..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 2:10 AM GMT
ఆ వివాదాస్పద ఎంపీకి పాకిస్థాన్ నంబర్ల నుండి బెదిరింపులట..!

సాక్షి మహారాజ్.. బీజేపీ ఎంపీ అయిన ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు పాకిస్థాన్ నెంబర్ల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. బాంబు బ్లాస్ట్ లో నిన్ను చంపేస్తామంటూ బెదిరిస్తూ ఉన్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సదర్ కొట్వాలీ ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర మిశ్రా ఆయన ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించారు. వున్నావ్ ఎంపీ అయిన సాక్షి మహారాజ్ కు పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాద సంస్థల నుండి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయట.. ఆయనను ఇంటితో సహా బాంబ్ బ్లాస్ట్ చేసి లేపేస్తామని వారు బెదిరించినట్లు చెబుతూ ఉన్నారు.

ఫోన్ చేసిన వ్యక్తులు పాకిస్థాన్ లోకి త్వరలోనే కాశ్మీర్ కలిసిపోనుందని చెప్పారట. అయోధ్య రామ మందిరం నిర్మాణ శంకుస్థాపన గురించి కూడా వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని సాక్షి మహారాజ్ తన ఫిర్యాదు లెటర్ లో రాశారు. ఫోన్ చేసిన వ్యక్తి, అతడి ముజాహిద్దీన్లు సాక్షి మహారాజ్ పై 24 గంటలూ దృష్టి పెట్టామని చెప్పాడట.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూనియన్ మినిస్టర్ అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను తిట్టాడని సాక్షి మహారాజ్ పోలీసులకు తెలిపారు.

తనకు వెంటనే రక్షణ కల్పించాలని.. తన ఆస్తులను కాపాడడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదును స్వీకరించామని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించామని అన్నారు. సాక్షి మహారాజ్ కు ఇప్పటికే వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో సెక్యూరిటీని మరింత పెంచనున్నామని ఎస్పీ రోహన్ పి కనయ్ తెలిపారు.

Next Story
Share it