వ్యాక్సిన్ ను నా కుమార్తె మీదనే ప్రయోగించారు.. ఆరోగ్యంగా ఉంది: పుతిన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 1:43 AM GMT
వ్యాక్సిన్ ను నా కుమార్తె మీదనే ప్రయోగించారు.. ఆరోగ్యంగా ఉంది: పుతిన్

ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారిపై కరోనా వ్యాక్సిన్‍ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా చ‌రిత్ర సృష్టించిందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్ర‌క‌టించారు. మంగళవారం నాడు పుతిన్ మాట్లాడుతూ తమ దేశం అప్రూవ్ చేసిన ఈ వ్యాక్సిన్ ను సొంత కుమార్తె మీదనే ప్రయోగించామని.. ఆమె డోస్ తీసుకుందని అన్నారు.

పెద్ద ఎత్తున ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆ దేశానికి చెందిన అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో టీచర్లకు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ ను వేయనున్నామని చెప్పుకొచ్చారు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ ముగియక ముందే ఈ వ్యాక్సిన్ ను వేయనున్నారు. మాస్కో లోని గామలేయ ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను తయారుచేసింది.

పెద్ద స్థాయిలో టెస్టింగ్ చేయక మునుపే రష్యా మార్కెట్ లోకి ఈ వ్యాక్సిన్ ను తీసుకుని రావడం పట్ల ప్రపంచ దేశాలకు చెందిన నిపుణులు, ఫార్మా కంపెనీలు ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల టెస్టులు, దీర్ఘకాలికంగా ఎటువంటి ఎఫెక్ట్ చూపుతాయో తెలుసుకోకుండానే వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకుని రావడం ఏమిటని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. రష్యా హెల్త్ మినిస్ట్రీ దీనిపై స్పందించలేదు.

సోవియట్ యూనియన్ 1957 లో లాంచ్ చేసిన ఆర్బిటల్ శాటిలైట్ పేరునే ఈ వ్యాక్సిన్ కు పేరుగా పెట్టారు. 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ ఇప్పుడు వ్యాక్సిన్ల రేసులో ముందు వరసలో నిలిచింది. వ్యాక్సిన్ రేసును పుతిన్ ప్రభుత్వం ఎలా చూసిందో పేరును బట్టే మనం అంచనా వేయవచ్చు. వ్యాక్సిన్ రేసులో నిలిచిన అమెరికా, యూరప్, చైనా, భారత్ ల కంటే తామే ముందు తీసుకుని వచ్చామని రష్యా వర్గాలు భావిస్తూ ఉన్నాయి.

ఈ వ్యాక్సిన్ ఎంతో ప్రభావంతమైనదని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. తన కుమార్తెలలో ఒకరు ఈ వ్యాక్సిన్ ను వేయించుకున్నారని అన్నారు. ఇంతకూ ఏ కుమార్తెకు వ్యాక్సిన్ ను వేశారు అన్నది చెప్పలేదు. తొలిసారి ఆమెపై టీకాను ప్రయోగించాక శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరిందని.. తర్వాతి రోజు 37 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది.. ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. రెండో టీకా తర్వాత కూడా ఆమె ఆరోగ్యం బాగుంది. ఆమె శరీరంలో సమృద్ధిగా యాంటీబాడీలు ఉత్పత్రి అయ్యాయని పుతిన్ తెలిపారు.

రష్యా వ్యాక్సిన్ విషయంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటూ ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తినట్లేనని అంటున్నారు. ఇతర దేశాలు కూడా ఇప్పటికే ఈ బాటలో ఉన్నాయని అంటున్నారు. చైనా కూడా ఓ వ్యాక్సిన్ ను తమ సైన్యానికి ఇస్తోంది.

ఇంకా క్లినికల్ ట్రయల్స్ పూర్తీ అవ్వకుండానే వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టామని ప్రకటించడం ద్వారా వ్యాక్సిన్ ప్రవేశపెట్టడానికి గల నియమాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జె.స్టీఫెన్ మారిసన్ తెలిపారు. ఇది చాలా పెద్ద డెవలప్మెంట్, అది పుతిన్ తో మొదలైంది.. పుతిన్ గెలవాలని ప్రయత్నిస్తున్నారు అని కూడా మారిసన్ అన్నారు. ఇంత దూకుడుగా ప్రవర్తించడం వలన కొన్ని కొన్ని సార్లు తిప్పికొట్టే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

వ్యాక్సిన్‌ను రెండు చోట్ల తయారు చేయనున్నారు. ది గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌, బిన్నోఫార్మా అనే కంపెనీలో తయారు చేస్తున్నారు. ఈ టీకాపై ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతుండడంతో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ను తయారు చేయడంపై సన్నాహకాలు మొదలయ్యాయి. విదేశాల్లో టీకా తయారీ అంశం ది రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) నిర్ణయంపై ఉంది. వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాస్కోను అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు.

వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించాలని ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని వస్తున్న వార్తలను రష్యా ఖండించింది.

1 బిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం ఇప్పటికే అప్లికేషన్స్ వచ్చాయని అంటున్నారు. రష్యా తీసుకున్న ఈ నిర్ణయం ఇతర ఫార్మా సంస్థల మీద కూడా ఒత్తిడి పడనుంది. ఇతర సంస్థలు, దేశాలు కూడా రష్యా బాటలో ప్రయాణిస్తే కష్టమేనని అంటున్నారు. విస్తృతమైన టెస్టింగ్ లు జరపకుండా వ్యాక్సిన్ లను తీసుకుని వస్తే తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆంటోనీ ఫాసీ చెబుతున్నారు. చైనా, రష్యా దేశాలు ఎక్కువ టెస్టింగ్ లు చేసిన తర్వాతే వ్యాక్సిన్లను ఇస్తే మంచిదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా టీకా ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షితమైన, సమర్థమైన టీకా అభివృద్ధికి తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. గమలేయా వ్యాక్సిన్ ఇంకా ఫేస్ 1 లో మాత్రమే ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మాట్లాడుతూ రష్యా హెల్త్ అథారిటీలతో తాము ఇంకా చర్చిస్తూనే ఉన్నామని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలను పాటించాలని కోరామన్నారు. ఒక వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యం గురించి కూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నారు.

Next Story