మంత్రి బాలినేనికి కరోనా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Aug 2020 9:09 AM GMTనాకు కరోనా సోకిందని.. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నానని.. త్వరలోనే ఇంటికి చేరుకుంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు, తన అభిమానులకు సందేశం పంపారు.
వివరాల్లోకి వెళ్ళితే గత 5 రోజులుగా మంత్రి బాలినేనికి చిన్న పాటి జ్వరం వచ్చింది. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. జ్వరం వస్తు పోతూ ఉండటంతో మంగళవారం మరోసారి మంత్రికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. దీంతో వైద్యులు సలహా మేరకు అపోలో హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరారు. మంత్రి ఆరోగ్యంగా ఉన్నారని చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడ్డారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన కుమారుడు వెంకటేశ్‌కు కూడా కరోనా సోకింది. బలరాం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. అయన కుమారుడు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.