Fact Check : దళితుడిని చితక్కొట్టి, చెట్టుకు కట్టేసి అతడితో మూత్రం తాగించారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Aug 2020 8:19 AM GMT
Fact Check : దళితుడిని చితక్కొట్టి, చెట్టుకు కట్టేసి అతడితో మూత్రం తాగించారా..?

ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతడితో ఏదో తాగిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఇదని.. కుల పిచ్చితో రెచ్చిపోతున్న కొందరు దళితుడిని చెట్టుకు కట్టేసి మూత్రం తాగిస్తున్నారని కొందరు ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అతడిని చితక్కొట్టారని పోస్టు పెట్టారు.

‘The Dalit Voice’ అనే ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు. దళితులను రాజస్థాన్ లో అగ్రకులాల వారు చాలా హీనంగా చూస్తున్నారని. దళితుడిని హింసించడమే కాకుండా అతడిని చెట్టుకు కట్టేసి బహిరంగంగా మూత్రం తాగేలా చేశారని చెబుతున్నారు.

కుష్ అంబేద్కర్ వాది అనే ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఈ వీడియోను పోస్టు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ అని తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ లో దళితులను చిన్న చూపు చూస్తున్నారన్నదానికి ఇదొక సాక్ష్యం అంటూ ఆ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

అగ్రకులాలకు చెందినవారు దళితుడిని చెట్టుకు కట్టేసి అతడితో మూత్రం తాగించారన్న ఈ పోస్టు 'పచ్చి అబద్ధం'.

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని అలా కట్టేయడానికి కారణం అక్రమ సంబంధం. అతడిని అలా కట్టేసిన వారు కూడా కుటుంబ సభ్యులే.. ఒకే కులానికి చెందిన వారు.

July 29, 2020 ఏఎన్ఐ వార్తా సంస్థ కూడా ఈ ఘటన గురించి ప్రచురించింది. బార్మర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆనంద్ శర్మ ఈ ఘటన గురించి స్పందించారు. ఈ వీడియో తమ దృష్టికి రావడంతో ఈ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించామని అన్నారు. చోటన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఇరు కుటుంబాలకు చెందిన వారు రాజీకి వచ్చారని.. అందువలన పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పోలీసులను ఘటనా స్థలానికి పంపామని ఆనంద్ శర్మ తెలిపారు. ప్రాథమిక విచారణలో ఓ మహిళతో అక్రమ సంబంధం వలన ఈ గొడవ జరిగిందని అన్నారు. కానీ అక్కడి వారెవరూ పోలీసులకు ఈ విషయం చెప్పలేదని తెలిపారు.

July 31, 2020 హిందుస్థాన్ టైమ్స్ లో ఈ ఘటనకు సంబంధించిన వార్తాకథనం వచ్చింది. వీడియో జులై 28 న వైరల్ అయింది. రత్నపురం గ్రామానికి చెందిన వ్యక్తి కోన్రా గ్రామంలోని ఓ ఇంట్లోకి వెళ్లడం గమనించిన స్థానికులు అతడిని చితక్కొట్టారని పోలీసులు తెలుసుకున్నారు. జులై 25న ఈ ఘటన చోటుచేసుకుంది.

వీడియోలో అతడి చుట్టూ చాలా మంది ఉండడం.. అతడితో ఓ ద్రవ పదార్థాన్ని తాగిస్తూ ఉండడం గమనించవచ్చు. ఎంతో మంది సోషల్ మీడియా యూజర్లు వీడియోలో అతడితో తాగించింది యూరిన్ అని అంటున్నారు. కానీ దీనిపై పోలీసులు విచారణ జరిపిస్తూ ఉన్నారు.

ఈ గొడవ జరిగింది ఒకటే కులానికి చెందిన వ్యక్తుల మధ్య అని.. అందుకే ఈ విషయాన్ని వారు పోలీసుల దగ్గరకు తీసుకుని రాలేదని పోలీసులు స్పష్టం చేశారు.

దళితుడిని అగ్రవర్ణాల వారు హింసించారన్న కథనాలు పచ్చి అబద్ధమని బార్మర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మొత్తం 6 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

కాబట్టి.. అగ్రవర్ణాలకు చెందిన వాళ్లు దళితుడితో మూత్రం తాగించారంటూ పెట్టిన పోస్టు 'అబద్ధం'

Next Story