ఆగస్టు 5కు మోడీ సర్కారు ఇచ్చే ప్రాధాన్యత లెక్క ఎప్పుడైనా చూశారా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Aug 2020 11:20 AM ISTఆరు అంకె అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా ఇష్టం. కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకున్న ప్రతిసారీ ఆరు అంకెతో లింకు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది కేసీఆర్ సెంటిమెంట్ అయితే.. మోడీ సర్కారుకు సైతం కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయా? అన్న సందేహం కలుగక మానదు. ఆగస్టు 5 వచ్చిందంటే చాలు.. మోడీ సర్కారు ఏదో ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న విషయం పాత పరిణామాల్ని చూసినప్పుడు చప్పున స్ఫురించకమానదు.
ఈ రోజున (ఆగస్టు 5) దశాబ్దాల తరబడి సాగుతున్న అయోధ్య రామాయల నిర్మాణానికి కీలకమైన భూమిపూజ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్న వారు కోట్లాది మంది దేశ వ్యాప్తంగా ఉన్నారు. ఈ రోజు జరిగే భూమిపూజతో 500 ఏళ్ల నాటి వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లవుతుందని చెప్పాలి.
ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భూమిపూజను నిర్వహించనున్నారు. ఆసక్తికరమైన విసయం ఏమంటే ప్రపంచ రాజకీయ.. పరిశోధన.. ఇతర రంగాలకు సంబంధించి కీలక ఘట్టాలకు ఆగస్టు 5 వేదికైంది. అంతే కాదు.. ఇదే రోజున మోడీ సర్కారు గతంలోనూ కీలక నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు ఆగస్టు 5కు.. మోడీ సర్కారుకు ఏదో లింకు ఉందన్న భావన కలుగక మానదు.
గత ఏడాది ఆగస్టు 5న కశ్మీర్ విషయంలో మోడీ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు తీస్తూ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. అంతేనా.. గతంలో ఇదే ఆగస్టు 5న ఆసియాలోనే అతి పెద్ద రైల్వే యార్డుగా గుర్తింపు పొందిన మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 5న జమ్ముకశ్మీర్.. లద్దాఖ్ రెండింటిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించటమే కాదు.. ఒకటే దేశం.. ఒకటే రాజ్యాంగం అంటూ తేల్చేసి కశ్మీర్ కున్న ప్రత్యేకప్రతిపత్తిని కలుగజేసే ఆర్టికల్ 370ను రద్దు చేశారు.
ఇక.. ఉత్తరప్రదేశ్ లోని మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్ పేరును 2018 ఆగస్టు 5న పండిల్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఆగస్టు 5న కీలక నిర్ణయాలు తీసుకోవటంలో మోడీ సర్కారు ముందుంటుంది. చూస్తుంటే.. ఆగస్టు 5న ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరగటానికి సరిపోయే రోజు అంటారా?