అయోధ్యకు బయలు దేరిన ప్రధాని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 5:04 AM GMT
అయోధ్యకు బయలు దేరిన ప్రధాని

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి జరగనున్న భూమిపూజలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దిల్లీ నుంచి అయోధ్యకు బయలేర్దారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలు దేరారు. లక్నో నుంచి అయోధ్య చేరుకోనున్నారు. 29 ఏళ్ళ అనంతరం ఆయన అయోధ్యను సందర్శించడం ఇదే మొదటిసారి. భూమి పూజ సందర్భంగా 40 కేజీల బరువైన వెండి ఇటుకను ఆయన శంకు స్థాపన స్థలంలో ఉంచనున్నారు. హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడికి పూజలు చేసిన అనంతరం మోదీ భూమిపూజ జరిగే స్థలానికి చేరుకుంటారు. 1990 లోనే మోదీ ఇక్కడ రామాలయ నిర్మాణం కోసం విశేష కృషి చేశారు.

రామమందిర భూమిపూజ సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 45 ఏళ్ల వయసు ఉండి కరోనా నెగిటివ్‌ వచ్చిన వారికే ప్రధాని భద్రతా బృందంలో చోటు కల్పించారు. మోదీతో బాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇతర వీవీఐపీలు సుమారు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బీజేపీ కురువృధ్ధుడు ఎల్.కె.అద్వానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. బాబా రామ్ దేవ్ ఈ ఉదయమే తన సహచరులతో హనుమాన్ గర్హి ఆలయానికి చేరుకున్నారు.

రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది. రంగు రంగుల పూల దండలు, కాషాయ తోరణాల అలంకరణలతో అయోధ్య శోభయమానంగా మారింది. అయోధ్యకు వెళ్లే రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలను, రామ్‌లల్లా చిత్రాలను అలంకరించారు. కోదండ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య నగరంలో దివ్య మందిరాన్ని నిర్మించేందుకు బుధవారం అంకురార్పణ జరగనుంది. వేద పఠనం, మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం మధ్నాహ్నాం12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దాదాపు 40 కిలోల వెండి ఇటుకతో ఆలయానికి శంకుస్థాపన చేస్తారు.

Next Story
Share it