అయోధ్య రామ మందిరం భూమి పూజకు హాజరయ్యేది వీరే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 5:25 AM GMT
అయోధ్య రామ మందిరం భూమి పూజకు హాజరయ్యేది వీరే..!

అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. 175 మంది ప్రముఖులను, 135 మంది సాధువులను ఆహ్వానించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.

కాషాయం రంగులో ఉన్న రామ జన్మభూమి ఆహ్వాన పత్రికపై ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టు కార్టులో పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ అధినేత మోహన్ రావ్ భగవత్ పేరును పేర్కొన్నారు. వీరితో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. రామ మందిర ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆహ్వానిస్తున్నట్టు కార్డు ఉంది.

అయోధ్య రామ మందిరం భూమిపూజ కార్యక్రమానికి తొలి ఆహ్వానపత్రిక ఒక ముస్లింకు ఇచ్చారు.. రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలమైన వాదన వినిపించిన ఇక్బాల్ అన్సారీకి ఇన్విటేషన్ ఇచ్చి భూమిపూజకు తప్పకుండా హాజరుకావాలని కోరారు. తనకు తొలి ఆహ్వానం అందాలన్నది శ్రీరాముడి ఆకాంక్షగా తాను భావిస్తున్నానని చెప్పారు. ఆహ్వానపత్రాన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నానని తెలిపారు. రామ మందిర నిర్మాణంతో అయోధ్య మరింత అందంగా మారుతుందని.. ప్రపంచ నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వస్తే ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. అయోధ్య అనేది పవిత్రమైన వ్యక్తుల నేల అని ఆయన చెప్పారు.

Next Story