పాసులు ఉన్నా.. పగటి పూట మాత్రమే రానిస్తారట
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 July 2020 7:20 AM GMTకాస్త టైం దొరికితే చాలు.. ప్రయాణాలు కట్టేసే రోజుల నుంచి.. ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టని చిత్రమైన రోజుల్ని మాయదారి రోగం తీసుకొచ్చింది. దీంతో.. అదే పనిగా రోజుల తరబడి ఇంట్లోనే ఉండిపోవటం చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా హైదరాబాద్ మహానగరంలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల పుణ్యమా అని.. ఎవరికి వారు వారి సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు.
ఇలా వెళ్లే వారిలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో.. టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఎక్కువ అవుతోంది. కేంద్ర నిబంధనలు ఎలా ఉన్నా.. తమకున్న పరిస్థితులకు అనుగుణంగా తమ రాష్ట్రంలోకి వచ్చే వారు ఎవరైనా సరే.. పాసులు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న వేళలో సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెబుతున్నారు.
ఏపీకి వచ్చేందుకు అనుమతి పత్రం ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. తమ ప్రభుత్వం జారీ చేసిన పాసులే అయినా.. నిర్ణీత సమయాల్లోనే రాష్ట్రంలోకి రానిస్తామని చెబుతున్న ఏపీ పోలీస్ బాస్ మాటల ప్రకారం పాసులు ఉన్న వారు ఎవరైనా సరే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల మధ్య కాలంలోనే ఓకే చెబుతామని స్పష్టం చేస్తున్నారు.
ఏపీ పోలీస్ బాస్ ఇంత క్లియర్ గా చెప్పిన వేళ.. ఏపీ సరిహద్దుల్లోకి వెళ్లేటప్పటికి సమాయాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. లేని పక్షంలో సరిహద్దుల్లోకి చేరుకున్న తర్వాత.. గంటల కొద్దీ వెయిట్ చేయక తప్పదు. అందుకే పక్కా ప్లానింగ్ ఉంటే తప్పించి ఏపీకి బయలుదేరటం ఏ మాత్రం మంచిది కాదంటున్న విషయాన్ని జాగ్రత్తగా మనసులో రిజిస్టర్ చేసుకోండి.