టెస్టు చేసుకోవాలంటే ఏపీలో జగన్ సర్కార్ అలా చేస్తోంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 6:55 AM GMT
టెస్టు చేసుకోవాలంటే ఏపీలో జగన్ సర్కార్ అలా చేస్తోంది

కొన్ని విషయాల్ని చాలా సీరియస్ గా తీసుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికొన్ని విషయాల్లో తనకే మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ కారణంతోనే మంచి చేసినప్పటికీ విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ద్వారా.. ఆయా అంశాల విషయంలో అదే పనిగా వేలెత్తి చూపించుకోవటం కనిపిస్తుంది. ఎక్కడి దాకానో ఎందుకు.. ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగాన్ని నిర్దారించేందుకు టెస్టులు చేసే విషయంలో కేసీఆర్‌.. విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు ఫెయిల్యూర్ అన్న ముద్ర వేసుకునే పరిస్థితి.

ఓవైపు ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో నిర్దారణ టెస్టులు ఎడాపెడా చేసేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం ఆచితూచి అన్నట్లుగా పరీక్షలు చేయటం వెనకున్న వ్యూహం ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటంలోనూ కేసీఆర్ సర్కారు ఫెయిల్ అయ్యిందన్న అపవాదును మూటగట్టుకుంది.

ఇదిలా ఉంటే.. ఏపీలో ఇప్పటికే ఏడు లక్షలకు పైగా నిర్దారణ పరీక్షలు చేసిన జగన్ సర్కారు.. మరింతమందికి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. తెలంగాణలో అందుకు భిన్నమైన పరిస్థితి. తెలంగాణలో నిర్దారణ పరీక్షలు చేయాలంటే ప్రభుత్వ.. ప్రైవేటు ల్యాబుల వద్ద పెద్ద ఎత్తున వెయిట్ చేయాల్సిన పరిస్థితి. చుట్టూ అనుమానితులు పెద్ద సంఖ్యలో ఉన్న దగ్గర.. ఆరోగ్య వంతులు ఉండటం ఏ మాత్రం క్షేమకరం కాదన్నది మర్చిపోకూడదు. కానీ.. అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు.

ఇలాంటివేళ.. ఈ ఇబ్బందికర పరిస్థితిని ఏపీలో అనుసరిస్తున్న విధానం ద్వారా అధిగమించొచ్చని చెప్పొచ్చు. ఏపీలో ఎవరైనా నిర్దారణ పరీక్ష చేయించుకోవాలనుకుంటే.. సింపుల్ గా ఒక లింకు ఇచ్చి అందులో వివరాల్ని నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. ఒక్కసారి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత.. సంబంధిత అధికారులే నేరుగా సంప్రదిస్తారు. దీంతో.. పరీక్షల కోసం అదే పనిగా బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

దీంతో.. నిర్దారణ పరీక్షలు ఒక క్రమపద్దతిలో జరగటమే కాదు.. అనవసరమైన రద్దీ తగ్గే వీలుందని చెబుతున్నారు. ఇంతకీ ఏపీలో అమలు చేస్తునన విధానంలో అప్లై చేసుకోవాల్సిన లింకు విషయానికి వస్తే.. https://t.co/8rxRHxCf32. మరి.. ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా ఫాలో అయితే మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది.

Next Story