జూన్‌లో నాలుగు లక్షల కేసులు.. 12వేల మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2020 5:15 AM GMT
జూన్‌లో నాలుగు లక్షల కేసులు.. 12వేల మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,653 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 507 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు 5,85,493 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం నమోదు అయిన కేసుల్లో 3,47,979 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,20,114 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 17,400 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 86,26,585 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,17,931 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. పది రాష్ట్రాల్లోనే కరోనా మహమ్మారి అధికంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. 1,74,761 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 7855 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత తమిళనాడులో 90వేల కేసులు నమోదు కాగా.. 1201 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో 87,360 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 2742 మంది చనిపోయారు.

దేశంలో లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. జూన్‌ 1తేదీకి దేశంలో 1.90లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. జూన్‌ 30వ తేదీ నాటికి 5.85లక్షలకు చేరింది. కేవలం నెలరోజుల్లోనే దాదాపు నాలుగు లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక జూన్‌ 1 నాటికి 5394 మంది మృత్యువాత చెందగా.. జూన్‌ 30నాటికి 17వేలు దాటింది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే 12వేల మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Next Story