తెలంగాణ, ఏపీ మధ్య బార్డర్ చెక్ పోస్టు రేపు ఎత్తివేత.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jun 2020 7:43 AM GMTఅమరావతి : కరోనా వ్యాప్తి నేపథ్యంలో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును రేపు తొలగించనున్నారు. లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. బార్డర్ లో బందోబస్తు ఏర్పాటు చేసి మరి రాకపోకలు బందు చేసారు.
అయితే.. తొలి దశ లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత అధికారులు కేవలం అత్యవసర వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతించారు. ఆ తర్వాత దశలవారీగా ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలు పెరిగాయి. ఇక తాజా సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలకు అనుమతించిన సంగతి తెలిసిందే.
దీంతో ఖమ్మం జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం సమీపంలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును రేపటి నుంచి తొలగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఇతర సరిహద్దులు కూడా తెరచుకోనున్నాయి. ఇదిలావుంటే ఏపీ, తెలంగాణలలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో 3290 మంది ఈ మహమ్మారి బారిన పడగా.. 1627 మంది కోలుకోగా.. 113 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఏపీలో 4303 మందికి కరోనా పాజిటివ్ రాగా.. 2576 మంది కోలుకోగా.. 73 మంది మరణించారు.