నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తుది అఫిడవిట్
By తోట వంశీ కుమార్ Published on 24 April 2020 8:07 PM ISTఏపీలో ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగించిన వ్యవహారం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ తొలగింపు కారణాలపై శుక్రవారం హైకోర్టుకు తుది అఫిడవిట్ ను సమర్పించింది. కాగా.. ఇప్పటికే ప్రభుత్వం ప్రిలిమినరీ కౌంటర్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో కీలకాంశాలివే..
రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించామని ప్రభుత్వం తెలిపింది. రిటైడ్ జడ్జీలను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా రూపొందిందించదని కోర్టు దృష్టికి సర్కార్ తీసుకెళ్లింది. మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఈసీల కాల పరిమితి వివరాలు కూడా ప్రభుత్వం వెల్లడించింది. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికల హింసకు సంబంధించిన వివరాలను సైతం కోర్టుకు వివరించింది. 2014లో 221 హింసాత్మక ఘటనలు జరిగితే.. 2020లో 88 ఘటనలు జరిగినట్టు వెల్లడించింది. ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని అఫిడవిట్‌లో పేర్కొంది. పోలీసులు, పరిపాలన యంత్రాంగంపై నిమ్మగడ్డ చేసిన ఆరోపణలు అవాస్తవాలు అని తెలిపింది. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారనే నిమ్మగడ్డ వేసిన పిటిషన్ అవాస్తవమని ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.