ఆయనపై చర్యలు తీసుకోకుండా సభ కొనసాగడానికి వీల్లేదు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Dec 2019 1:29 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఉద్దేశించి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదానికి తెరలేపాయి.
చంద్రబాబు స్పీకర్‌ను ఉద్దేశించి.. వేలు చూపిస్తూ సభ్యత లేదని.. మర్యాదగా ఉండదు అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యల పట్ల వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నేత అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయితో ఫైర్ అయ్యారు. స్పీకర్ ను బెదిరించే దోరణితో.. విమర్శించడం దారుణమని అన్నారు. సభలో జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత స్పీకర్ చైర్‌ను ఉద్దేశించి అనకూడని మాటలు అని.. సవాల్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
ఈ విషయమై చంద్రబాబు మీద చర్య తీసుకోవాలని అన్నారు. చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా... సభలో సభ్యత పాటించడం తెలియదని ఎద్దేవా చేశారు. సభా మర్యాదలు పాటించని సభ్యునిపై చర్యలు తీసుకోకుండా సభ కొనసాగడానికి వీల్లేదని.. సభ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇక చంద్రబాబు వ్యాఖ్యల పట్ల స్పీకర్ తమ్మినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ముందుకు నడిపించాల్సిన బాధ్యత తనకు ఉందని అన్నారు. అందుకే.. చంద్రబాబును మన్నిస్తున్నానని.. ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.