నీతులు చెప్పే చంద్ర‌బాబే.. హెరిటేజ్‌లో ఉల్లి రూ.200 విక్ర‌యిస్తున్నారు: జ‌గ‌న్‌

By Newsmeter.Network  Published on  9 Dec 2019 9:28 AM GMT
నీతులు చెప్పే చంద్ర‌బాబే.. హెరిటేజ్‌లో ఉల్లి రూ.200 విక్ర‌యిస్తున్నారు: జ‌గ‌న్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఈ రోజు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌స్తుత ఉల్లి ధ‌ర పెరిగిపోవ‌డంతో స‌మావేశంలో ఉల్లి అంశంపై చ‌ర్చ సాగింది.ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కిలో ఉల్లి రూ. 25కు అందిస్తున్నామ‌ని అన్నారు. ఒక వేళ ఉల్లి రాష్ట్రంలో అందుబాటులో లేక‌పోయినా... ప‌క్క రాష్ట్రాల నుంచి తీసుకువ‌చ్చి అందిస్తున్నామ‌న్నారు. తాము ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారిస్తామ‌ని, అదే చంద్ర‌బాబు హెరిటేజ్ షాపుల్లో కిలో ఉల్లి రూ. 200ల‌కు విక్ర‌యిస్తున్నార‌ని ఆరోపించారు. తామ‌కు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తున్నామ‌ని, త‌మ హ‌యంలో ప్ర‌జ‌లు ఇబ్బందుల‌కు గురికావ‌ద్ద‌నేదే త‌మ ఉద్దేశ‌మ‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో ఉల్లి రైతుల‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర లేక ఎంతో న‌ష్ట‌పోయార‌ని, చివ‌ర‌కు రైతులు వ్య‌వ‌సాయాన్నే వ‌దిలేసే దుస్థితికి తీసుకువ‌చ్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేశామ‌ని, ఐదేళ్ల‌లో ఎంతో అభివృద్ధి సాధించామ‌ని గొప్ప‌లు చెప్పుకోవ‌డం త‌ప్ప చేసిందేమి లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. త‌మ ప్ర‌భుత్వంఏర్ప‌డి ఆరు నెల‌ల్లోనే ఎంతో అభివృద్ధి సాధించామ‌ని, ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేర్చుకుంటూ వ‌స్తున్నామ‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 36,500 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేశామ‌ని చెప్పారు. రాష్ట్రంలో ఉల్లి దొర‌క్క‌పోయినా.. సోలాపూర్‌, ఆల్వాల్ లాంటి ప్రాంతాల నుంచి తీసుకువ‌చ్చి రైతు బ‌జార్లో విక్ర‌యిస్తున్నామ‌న్నారు. కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే ఇంత త‌క్కువ ధ‌ర‌కు ఉల్లిని అంద‌జేస్తున్నామ‌ని, తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ప్ర‌తిప‌క్షాలు ఓర్వ‌లేక లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నామ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

నీతులు చెప్పే చంద్ర‌బాబే హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200 ఉల్లి విక్ర‌యిస్తున్నా... టీడీపీ నేత‌లు పేప‌ర్లు ప‌ట్టుకుని ఇక్క‌డి వ‌చ్చి దిగ‌జారిపోయి మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. వీళ్లు చేసే ప‌నుల‌లో న్యాయం, ధ‌ర్మం ఉందా.. అని ప్ర‌శ్నించారు. అదే విధంగా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని అన్నారు.

మహిళల భద్రతకై కొత్త చట్టాలు తీసుకు వచ్చి ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంద‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో, వాటిపైనే చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం కొత్త చ‌ట్టం తీసుకురానున్న‌ట్లు చెప్పారు.

Next Story
Share it