జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఈ పర్యటనకు ముందు బీజేపీ-జనసేన మధ్య వైరం ఉందనే ప్రచారం బాగా సాగింది. కానీ ఆ పర్యటన తర్వాత చాలా మార్పులే కనిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసే పని చేస్తాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ పెద్దలను పవన్ కలిసి మాట్లాడారంటే రెండు పార్టీల మధ్య ఎంత బలమైన బంధం ఉందో అర్థమవుతుందని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం అనేక పార్టీల నేతలను కలుస్తుంటామని, రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చంద్రబాబును కలిశామని, అంతమాత్రాన టీడీపీతో పొత్తు ఉందని కాదని వీర్రాజు చెప్పారు.
ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అనేక అంశాలపై లోతుగా చర్చించామని, అధికారం సాధించేందుకు ఏం చేయాలో మాట్లాడుకున్నామని అన్నారు. తన ఢిల్లీ టూర్ సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నానని, వైసీపీని ఓడించడమే బీజేపీ, జనసేన లక్ష్యమని అన్నారు.