ఏపీకి బీజేపీ డబ్బులివ్వకుంటే మద్దతు ఉపసంహరించుకోండి..చంద్రబాబుకు షర్మిల సూచన

By Knakam Karthik  Published on  28 Jan 2025 12:59 PM IST
Andrapradesh, Ys Sharmila, Cm Chandrababu, Tdp,Bjp, Congress, Janasena, Pm Modi

ఏపీకి బీజేపీ డబ్బులివ్వకుంటే మద్దతు ఉపసంహరించుకోండి..చంద్రబాబుకు షర్మిల సూచన

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డ్ పడ్డట్లే అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్, సూపర్ ఫ్లాప్ అంటూ ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నీతి ఆయోగ్ రిపోర్టు ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని సీఎం చంద్రబాబు నీతి సూక్తులు చెప్పారంటూ ఎద్దేవా చేశారు. పథకాలు రావాలంటే ఆదాయం పెంచాలట అని చంద్రబాబు అన్నదాతలను వంచించారు, 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారు, కోటిన్నర మంది మహిళలను మోసం చేశారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని కూటమి ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేశారు.

రాష్ట్రంలో పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం, జగన్ ఆర్థిక నిదర్శనమే చెప్పే చంద్రబాబుకి.. ఎన్నికల్లో హామీలు ఇచ్చేముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో ఏపీని గాడిలో పెడతామన్నది మీరే కదా? తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఎక్స్ వేదికగా షర్మిల ప్రశ్నించారు.

రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు.. రాష్ట్ర దీనస్థితిపై ప్రధాని మోడీని పట్టుబట్టాలని ఆమె డిమాండ్ చేశారు. పథకాలకు కావాల్సిన నిధులు ఇవ్వాలని అడగాలంటూ ఆమె రాసుకొచ్చారు. నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు. రాష్ట్ర ఆదాయం ఏ కోటకు మళ్లిందో తేల్చాలని, పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని షర్మిల కోరారు.

Next Story