ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. దీనిని ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నెరవేరిన చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలకు పైగా భూములను త్యాగం చేసిన అమరావతి రైతుల కృషిని, వారి అపారమైన విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా స్మరించుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ఎన్డీయే ప్రభుత్వ సహకారానికి ఈ విజయం దక్కిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం ఎదుర్కొన్న అనిశ్చితికి ఈ బిల్లుతో తెరపడిందని, ఇది పెట్టుబడిదారుల్లోనూ, యువతలోనూ కొత్త భరోసా నింపుతుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత భారత్ లక్ష్యాల సాధనలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.