చంద్రబాబు తనను మోసం చేస్తే ఊరుకోవడానికి తానేం గడ్డం కూడా రాని చిన్న పిల్లవాడినా? అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎలాంటి వ్యూహం లేకుండానే రాజకీయాల్లోకి వచ్చానా అని అన్నారు. కొంతమంది కాపు నేతలు అన్ని విషయాల్లో కులం అంటారని, కానీ రాజకీయం దగ్గరకు వచ్చేసరికి కులం అంటారేమిటని ప్రశ్నించారు. కులాల్ని వదులుకోమని తాను చెప్పడం లేదని.. ఎవరి ఉనికిని వారు కాపాడుకోవాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడితే తాను స్పందించడానికి అర్థం ఉందన్నారు. పద్నాలుగేళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు కుటుంబాన్నే అన్నారంటే మనల్ని అనరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. తాను తప్పు ఎక్కడ ఉంటే అక్కడ తాట తీసి ప్రశ్నిస్తానని.. తప్పును నిలదీసే గుండెధైర్యం లేకుంటే రాజకీయాల్లోకి రావొద్దని చెప్పారు. సీఎం జగన్ ఏ మతానికి, ఏ కులానికి న్యాయం చేయలేదన్నారు. ఎస్సీలకు అంబేద్కర్ స్కాలర్ షిప్స్ తీసేశారని ఆరోపించారు. వైసీపీని అధికారం నుండి తప్పించాలని అన్నారు.
మార్పు రావాల్సింది నాయకుల్లో కాదని, ప్రజల్లో అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను తిట్లు తినేందుకు, సిద్ధమని, కానీ ప్రజలు అండగా ఉండాలన్నారు. నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం నా కుటుంబాన్ని, చిన్న పిల్లల్ని తిట్టినా పడ్డానని చెప్పారు. తాను సీఎం కావాలంటే మనకు మొదట మంచి సీట్లు రావాలన్నారు. భావోద్వేగాలతో కాకుండా ఆలోచనతో రాజకీయం చేద్దామన్నారు.