రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం: పవన్ కల్యాణ్
ప్రజలకు అన్నం పెట్టే రైతు ఎప్పుడూ కన్నీరే పెడుతున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
By అంజి
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం: పవన్ కల్యాణ్
ప్రజలకు అన్నం పెట్టే రైతు ఎప్పుడూ కన్నీరే పెడుతున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా ఆయన గురువారం జనసేన కొత్త కార్యాలయంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత మాట్లాడుతూ.. తెలంగాణ విభజన తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి పంటలు పండుతాయన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తే.. జైల్లో పెడుతున్నారని అన్నారు. ధాన్యం సేకరణ నిర్వహణలో అసమర్థతను ఎత్తిచూపుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర దాడిని ప్రారంభించారు. రైతుల ఇళ్లలో ధాన్యం నిల్వలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన వారికి సానుభూతి తెలిపారు.
ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని సేకరించి ఉంటే వర్షపు నీటికి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. వరిపంట అమ్ముకున్న రైతులకు రావాల్సిన నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆరోపించారు. రుణమాఫీ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. జనసేనకు తమ ఆవేదనను తెలిపిన రైతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని, రైతులకు న్యాయం జరిగేలా జనసేన పోరాటం చేస్తుందన్నారు.