ఏమి చేద్దాం సార్.. మోదీతో అమిత్ షా భేటీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 2:06 PM IST
ఏమి చేద్దాం సార్.. మోదీతో అమిత్ షా భేటీ..!

భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిరోజుల కిందట మాట్లాడుతూ.. మే నెల ఆఖరు కల్లా భారత్ లో కరోనా ప్రభావం తగ్గిపోతుందని అన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకీ భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో లాక్ డౌన్ సడలింపుల కారణంగా కూడా వైరస్ ప్రబలుతోంది అంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కాకూడదు అంటే లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.

హోమ్ మినిస్టర్ అమిత్ షా తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అలాగే పలువురు ముఖ్యమంత్రులతో మోదీ చర్చించారు. ఈ ఆదివారానికి లాక్ డౌన్ ముగియనుండడంతో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి అన్నదానిపై ముఖ్యమంత్రుల సలహాలను అడిగారు. ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలో కూడా మోదీతో అమిత్ షా చర్చించారు. మే 31 తర్వాత లాక్ డౌన్ ను పొడిగిస్తే ఏమవుతుంది అన్న అంశంపై సూచనలను తెలియజేయాలని అమిత్ షా ఒకరోజు ముందే రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగారు. అందరు ముఖ్యమంత్రులు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక ముందుకు వెళ్లాలని తెలిపారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. అమిత్ షా తో చర్చిస్తూ లాక్ డౌన్ ను ఇంకో రెండు వారాలు పెంచితే మంచిదని తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ మీద తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలివేశారని తెలుస్తోంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మాత్రం అమలులోనే ఉంటుందని తెలుస్తోంది.

భారత్ లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 7,466 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 175 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 1,65,799కి చేరగా, మృతుల సంఖ్య 4,706 చేరుకుంది. 89,987 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతుండగా.. 71,106 మంది కోలుకున్నారు.

Next Story