కామారెడ్డి: వలస కార్మికుల వ్యాన్ బోల్తా.. 15 మంది..
By సుభాష్ Published on 12 May 2020 7:06 PM IST![కామారెడ్డి: వలస కార్మికుల వ్యాన్ బోల్తా.. 15 మంది.. కామారెడ్డి: వలస కార్మికుల వ్యాన్ బోల్తా.. 15 మంది..](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/Kamareddy-Road-accident.jpg)
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కార్మికులతో వెళ్తున్న ఓ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ నుంచి జార్ఖండ్ వెళ్తుండగా, కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం దగ్గి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై వ్యాన్ టైర్ పగిలి బోల్తాపడింది.
కాగా, గత శుక్రవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమదం సంభవించి 19 మంది వలస కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. చాలా మంది వరకూ గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రైల్వే పట్టాలపై నిద్రపోతున్నవలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుంచి ఆగ్రాకు మామిడిపళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు పఠా రోడ్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రక్కులో మొత్తం 16 మంది కూలీలున్నారు. అలా రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో వలస కూలీలు మృతి చెందుతున్నారు. వారిని స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుంటే బతికి ఉండేవారేమోనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. స్వస్థలాలకు వెళ్దామంటే రవాణా సౌకర్యం లేక వెళ్లలేకపోయారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను స్వస్థలాలకు తరలించే విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు రైలు మార్గాల ద్వారా, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా, కంటైనర్‌ల ద్వారా వెళ్తున్నారు. తినేందుకు తిండి లేక, చేసుకునేందుకు పనులు లేక కొందరి ఆకలి బతుకులకు చివరి ప్రయాణమే అవుతుంది.