ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షల సంఖ్య
By Medi Samrat Published on 5 July 2020 1:13 PM GMTఅమరావతి : ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తి నివారణలో అత్యంత వేగంగా ఏర్పాట్లు చేసింది. రెండు నెలల క్రితం వైరస్‌ను నిర్ధారించే స్థితిలో లేని రాష్ట్రం.. ఇప్పుడు ఏకంగా 78 చోట్ల కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
కరోనా వైరస్‌ను ఏపీలో గుర్తించిన నాటి నుండి అప్రమత్తంగా వ్యవహరిస్తూ, వైద్య పరీక్షలతో పాటు, క్వారంటైన్, ఐసొలేషన్, ఆస్పత్రుల్లో చికిత్స, రోగులు కోలుకున్న తర్వాత వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడం వరకు ప్రతి అంశంలో ప్రత్యేకత నిలుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు వేసింది.
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్:
వీలైనన్ని చోట్ల కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ కేసులు గుర్తిస్తే వెంటనే వారికి క్వారంటైన్ లేదా ఐసొలేషన్ చేయడం, అవసరమైతే ఆస్పత్రుల్లో చికిత్స చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా వ్యవహరిస్తోంది. చికిత్స అనంతరం వారిని ప్రభుత్వమే సురక్షితంగా ఇళ్లకు చేర్చడంతో పాటు, ప్రతి ఒక్కరికి రూ.2 వేల ఆర్థిక సహాయం కూడా చేస్తోంది. అందుకే చాలా తక్కువ వ్యవధిలో 10 లక్షల వైద్య పరీక్షల మైలురాయిని దాటి ఒక రికార్డు సృష్టించింది.
ఎక్కడెక్కడ ఈ పరీక్షలు?
రాష్ట్రంలో తొలుత కరోనా పరీక్షలకు అనువైన ల్యాబ్స్ లేకపోవడం వల్ల, ఫిబ్రవరి 1న తొలి శాంపిల్‌ను తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత రాష్ట్రంలో తొలి కరోనా పరీక్ష మార్చి 7న తిరుపతిలోని స్విమ్స్ (శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ)లో నిర్వహించారు. తొలి దశలో కేవలం స్విమ్స్‌లో మాత్రమే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే సదుపాయం ఉండగా, ఆ తర్వాత వేగంగా పలు చోట్ల ఆ సదుపాయం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం 78 ల్యాబ్‌లలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 15 చోట్ల కరోనా వైద్య పరీక్షల కోసం సదుపాయాలు కల్పించారు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖపట్నం ఏఎంసీ, కాకినాడ ఆర్‌ఎంసీ, విజయవాడ ఎస్‌ఎంసీ, గుంటూరు జీఎంసీ, ఒంగోలు రిమ్స్, నెల్లూరు ఏసీఎస్‌ఆర్ జీఎంసీ, తిరుపతి స్విమ్స్, తిరుపతి ఎస్వీఆర్‌ఆర్‌జీహెచ్, కడప రిమ్స్, కర్నూలు కేఎంసీ, అనంతపురం జీఎంసీ, ఏలూరు అస్రమ్, విజయనగరం మిమ్స్, మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వీటితో పాటు, 4 ప్రైవేటు ల్యాబ్‌లలో కూడా కరోనా వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో 19 వీఆర్‌డీఎల్ ల్యాబ్‌లు పని చేస్తున్నాయి. ఇంకా 47 చోట్ల ట్రూనాట్ ల్యాబ్స్, 5 సీబీనాట్, 2 నాకో(విజయవాడ ఎస్‌ఎంసీ, విశాఖపట్నం ఏఎంసీ), 5 సీఎల్‌ఐఏ ల్యాబ్‌లలో కరోనా వైద్య పరీక్షలు చేస్తున్నారు. వాటన్నింటిలో కలిపి రోజుకు 34,525 వైద్య పరీక్షలు చేయవచ్చు.
ఎన్ని రోజుల్లో ఎన్ని పరీక్షలు?:
రాష్ట్రంలో తొలి లక్ష పరీక్షల నిర్వహణకు 59 రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత రెండో లక్ష పరీక్షలకు 12 రోజుల సమయం పట్టగా, మూడవ లక్ష పరీక్షలు 11 రోజుల్లోనే పూర్తి చేశారు. అనంతరం 10 రోజుల్లో 4 లక్షలు, 8 రోజుల్లో 5 లక్షలు, 7 రోజుల్లో 6 లక్షల కరోనా పరీక్షలు చేయగా, మరో 5 రోజుల్లో పరీక్షల్లో 7 లక్షల మైలురాయి దాటారు.
ఆ తర్వాత వరసగా నాలుగేసి రోజుల్లో లక్ష చొప్పున కరోనా వైద్య పరీక్షలు పూర్తి చేసి, సరిగ్గా ఆదివారం ఉదయానికి 10 లక్షల మార్కు దాటారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రంలో మొత్తం 10,17,123 కరోనా పరీక్షలు పూర్తి ఒక రికార్డు సృష్టించారు.
జిల్లాల వారీగా:
జిల్లాల వారీగా కరోనా పరీక్షలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 71,194 కరోనా శాంపిల్స్ పరీక్ష చేయగా, చిత్తూరు జిల్లాలో 79,765 పరీక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 1,02,219 పరీక్షలు, గుంటూరు జిల్లాలో 87,063 పరీక్షలు, కడప జిల్లాలో 70,164 పరీక్షలు, కృష్ణా జిల్లాలో 1,05,157 పరీక్షలు, కర్నూలు జిల్లాలో 98,929 పరీక్షలు, నెల్లూరు జిల్లాలో 59,640 పరీక్షలు, ప్రకాశం జిల్లాలో 63,663 పరీక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 97,729 పరీక్షలు, విశాఖపట్నం జిల్లాలో 75,599 పరీక్షలు, విజయనగరం జిల్లాలో 40,720 పరీక్షలు చేయగా పశ్చిమ గోదావరి జిల్లాలో 62,703 మందికి కరోనా వైద్య పరీక్షలు చేశారు. ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 2,179 మందితో పాటు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 416 మందికి కరోనా వైద్య పరీక్షలు చేశారు.
ప్రతి 10 లక్షల మందిలో:
కరోనా వైద్య పరీక్షల్లో రికార్డు సృష్టించిన ప్రభుత్వం, ప్రతి 10 లక్షల మందిలో చేసిన వైద్య పరీక్షల్లోనూ దేశ సగటు దాటింది. దేశ వ్యాప్తంగా 95,40,132 కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆ సంఖ్య ప్రతి 10 లక్షల మందిలో 6,578 మాత్రమే. ఇక రాష్ట్రంలో ఆదివారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన 10,17,123 పరీక్షలను అదే నిష్పత్తిలో చూస్తే, ఆ సంఖ్య 19,047. అంటే రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందిలో 19,047 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరణాల రేటు తక్కువ:
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో 18,680 పాజిటివ్‌గా తేలగా, 232 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 1.24 శాతం మాత్రమే. అది జాతీయ స్థాయిలో 2.86 శాతం ఉంది. తెలంగాణలో 288 మంది మరణించగా, ఆ రాష్ట్రంలో మరణాల రేటు 1.29 శాతంగా నమోదైంది.