50వేల పరీక్షల టాస్కు పూర్తి.. నెక్ట్స్ ఏంటి.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 8:53 AM GMT
50వేల పరీక్షల టాస్కు పూర్తి.. నెక్ట్స్ ఏంటి.?

రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను వణికిస్తోంది. ఊహించని రీతిలో నమోదవుతున్న కేసుల నేపథ్యంలో.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా యాభై వేల పరీక్షల టాస్కును పూర్తి చేసినట్లుగా రాష్ట్ర వైద్య.. ఆరోగ్య సంచాలకులు శ్రీనివాసరావు చెబుతున్నారు.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మహమ్మారి బారిన పడిన వారంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా.. రిస్కు రేటు తక్కువగా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పారు.

జూన్ లో 15వేల కేసులు నమోదైనట్లుగా చెప్పిన ఆయన.. పాజిటివ్ లో క్రిటికల్ కేసుల్ని మాత్రమే ఆసుపత్రిలో చేర్చాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. ఈ కారణంతోనే గాంధీలో అత్యవసర కేటగిరి పేషెంట్లను చేర్చుకొని వైద్యం చేస్తున్నట్లు చెప్పారు. పాజిటివ్ గా తేలిన చాలామందిలో వైరస్ లక్షణాలు ఎక్కువమందికి లేవన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్ తో కలిసి జీవించాలని చెప్పిన ఆయన.. సోషల్ మీడియాలో వచ్చే అంశాల్ని నమ్మొద్దంటున్నారు.

ప్రైవేటు ల్యాబుల్లో వైరస్ నిర్దారణ కోసం అనుసరిస్తున్న విధానం బాగోలేదన్నారు. అనుమానితుల్లో ఎక్కువగా పాజిటివ్ లు వస్తున్నాయని.. అందుకు కారణాలు ఏమిటన్న విషయాన్ని తాము తనిఖీ చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే 12 ల్యాబ్ లకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పిన ఆయన.. వారందరి నుంచి వివరణ తీసుకుంటున్నట్లు చెప్పారు.

తాజాగా హైదరాబాద్ లో మరో ఐదు ల్యాబ్ లకు పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చినట్లుగా చెప్పారు. ఇన్ని వివరాల్ని చెప్పిన పెద్ద మనిషి.. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వారం.. పది రోజుల్లో కాకుండా.. యాభై వేల పరీక్షలకు ఎక్కువ టైం ఎందుకు తీసుకున్న వైనంపైనా కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుండేదన్న మాట వినిపిస్తోది.

Next Story