జగన్.. మంచి చేస్తూ ఈ తలనొప్పులెందుకు.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2020 7:11 AM GMT
జగన్.. మంచి చేస్తూ ఈ తలనొప్పులెందుకు.?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకుంది. క్షేత్ర స్థాయికి వెళ్లి అడిగితే జగన్ పాలన పట్ల సంతృప్తే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రామాల్లో జగన్ పాలన చాలా బావుందనే అంటున్నారు. అందుక్కారణం వారికి సంక్షేమ పథకాలు పక్కాగా అందుతుండటం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే.. కరోనా టైంలో ఆదాయం అంతా ఆగిపోయినా సరే.. జగన్ సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గలేదు. పక్కాగా నిధులు కేటాయించాడు. నవరత్నాల హామీల్ని ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

ఈ పథకాల అమలుతో తన ఓటు బ్యాంకును బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు జగన్. గ్రామ వాలంటీరు, సచివాలయాల వ్యవస్థ విషయంలో మొదట్లో విమర్శలు వచ్చినా.. అవి ఇప్పుడు కుదురుకున్నాయి. పంచాయితీ దాటి బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని పనులూ అవుతుండటం.. కరోనా టైంలో వాలంటీర్ల వ్యవస్థ చక్కగా పని చేయడంతో జనాల్లో సానుకూల స్పందన వస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై జనాల్లో సానుకూల స్పందనే ఉంది.

‘నాడు-నేడు’ పేరుతో స్కూళ్లను బాగు చేయడంపై జగన్ సర్కారు దృష్టిపెడుతోంది. అది మంచి ఫలితాలనిచ్చేలా కనిపిస్తోంది. అమ్మ ఒడి, ఫీజు రీఎంబర్స్‌మెంట్, పింఛన్లు, రైతు భరోసా.. ఇలా వివిధ మార్గాల్లో జనాల ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయి. ఇలా జగన్ సర్కారు మెజారిటీ ప్రజల నుంచి మంచి మార్కులే వేయించుకుంటున్నా.. మీడియాలో మాత్రం బాగా అన్ పాపులర్ అయిపోతోంది. అవనసర వివాదాలు కొని తెచ్చుకుంటోంది.

ఉదాహరణకు ప్రభుత్వ భవనాలకు రంగులేసే విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలెదుర్కొంది. మంచి పనులు చేస్తే జనాలు గుర్తు పెట్టుకుంటారు. ఇలా రంగులేస్తే సానుకూల స్పందనేమీ రాదు. దీనిపై హైకోర్టులో, సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బలు తగిలాయి. టీటీడీ భూముల అమ్మకాల జీవోతోనూ ఇలాగే వైకాపా సర్కారు జాతీయ స్థాయిలో విమర్శలెదుర్కొంది.

ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విషయంలో, ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు విమర్శల పాలైంది. ఇక్కడ సలహాదారులు జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ పథకాల అమలు, మరికొన్ని మంచి కార్యక్రమాలతో మంచి పేరు సంపాదిస్తూనే.. ఈ అనాలోచిత నిర్ణయాలు, అనవసర వివాదాలతో అన్‌పాపులర్ అవుతోంది. వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో ఇకనైనా ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడుతుందేమో చూడాలి.

Next Story