నాపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.. డీజీపీని క‌లిసి ఫిర్యాదు చేస్తా..

By Medi Samrat  Published on  30 July 2020 4:14 PM IST
నాపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.. డీజీపీని క‌లిసి ఫిర్యాదు చేస్తా..

గుంటూరు : పెద్ద‌కాకాని మండ‌లం నంబూరు గ్రామంలో నిర్వ‌హిస్తున్న‌ పేకాట శిబిరంతో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సంబంధం ఉందని.. ఈ గాంబ్లింగ్ చేయిస్తున్నది ఆమేనని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. పేకాట శిబిరంతో తనకు సంబంధం లేదని చెప్పారు. నంబూరు గ్రామం తన నియోజకవర్గంలోకి రాదని తెలిపారు.

ఈ కథనాలు తనను ఎంతో బాధిస్తున్నాయని శ్రీదేవి కన్నీటి పర్యంత‌మ‌య్యారు. పేకాట శిబిరం అంశంపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి వార్తలు వేయిస్తున్నారని ఆరోపించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఇప్ప‌టికే పోలీసుల‌ను క‌లిసాన‌ని.. డీజీపీని కూడా కలుస్తానని తెలిపారు.

డాక్టర్‌గా పని చేసిన మహిళా ఎమ్మెల్యేపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీదేవి మండిపడ్డారు. తనతో ఫోటోలు దిగినంత మాత్రనా తన అనుచరుడు అనడం సబాబు కాదన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు అందరు తన సన్నిహితులేనని ఆమె చెప్పారు పేకాట ఆడిస్తున్నానంటూ తప్పుడు కథనాలను రాస్తున్నారని అన్నారు. పేకాట ఆడుతూ దొరికిన వారిని విడిచిపెట్టాలని తాను పోలీసులకు ఫోన్ చేసి చెప్పాననే వార్తల్లో నిజం లేదని చెప్పారు.

తన గురించి తప్పుడు వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏదైనా వార్త‌ రాసే ముందు నిజాలు తెలుసుకోవాలని అన్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నాను కాబట్టే.. వాస్తవాలను వివరించడానికి మీడియా ముందుకు వచ్చానని శ్రీదేవి అన్నారు.

Next Story