ప్రియాంక ‘టీ’కి రమ్మంటే.. ‘డిన్నర్’కు మా ఇంటికే రావాలంటూ రిప్లై

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 July 2020 7:18 AM GMT
ప్రియాంక ‘టీ’కి రమ్మంటే.. ‘డిన్నర్’కు మా ఇంటికే రావాలంటూ రిప్లై

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎప్పుడూ ఒకరి అధిక్యమే నిలబడదు. మారే కాలానికి తగ్గట్లు తరచూ మార్పులు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా అలాంటి సన్నివేశమే ఒకటి కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తోన్న గాంధీ కుటుంబం నుంచి ఏ నేతకైనా ఆహ్వానం అందితే దాన్నో గొప్ప అంశంగా ఫీల్ అవుతారు. పార్టీ ఏదైనా.. తమకు గుర్తింపు లభించిందన్నట్లుగా ఉంటుంది. అందుకు భిన్నంగా.. మాటకు మాట.. ఇన్విటేషన్ కు కౌంటర్ ఇన్విటేషన్ ఇవ్వటం ఇప్పటివరకూ చోటు చేసుకోలేదు. తాజాగా ఆ ముచ్చట తీరింది.

తమ ఇంటికి తేనీటి విందుకు రావాలంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బీజేపీ రాజ్యసభ సభ్యుడ్ని ఆహ్వానించటం ఆసక్తికరంగా మారింది. ప్రియాంక ఆహ్వానానికి బీజేపీ నేత అనిల్ బులానీ ఎలా రియాక్ట్ అవుతారో? అన్న ప్రశ్న వ్యక్తమైంది. కొందరి అంచనాలను నిజం చేస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలున్నాయి. తనను తేనీటి విందుకు ఆహ్వానించిన ప్రియాంకను.. తమ ఇంటికే ఆమె రావాలని కోరారు.

తనకు టీ ఏమీ అక్కర్లేదు కానీ.. అందుకు బదులుగా తమ ఇంటికే డిన్నర్ కు రావాలన్న ఆహ్వానాన్ని పలకటం ఇప్పుడు రోటీన్ కు భిన్నమనే చెప్పాలి. అలా అని ఇంటికి రావాలన్న మాటకు పరుషంగా రియాక్ట్ అయినట్లు కాకుండా.. తానెందుకు రాలేనన్న విషయాన్ని సున్నితంగా చెప్పి.. ప్రియాంకకు పంచ్ ఇచ్చారనే చెప్పాలి.

ఇంతకీ అనిల్ బులానీని తేనీటి విందుకు రావాలని ప్రియాంక ఆహ్వానించటం వెనుక కారణం లేకపోలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె 35 లోధీ స్టేట్ బంగళాను ఖాళీ చేయనున్నారు. ఆ బంగళాలోకి రాజ్యసభ సభ్యులు అనిల్ రానున్నారు. దీంతో.. తమ ఇంటికి తేనీటి విందుకు రావాలని ప్రియాంక పిలిచారు.

దీనికి రియాక్ట్ అయిన బులానీ.. తాను కేన్సర్ చికిత్స తర్వాత ఇంటికి వచ్చానని.. డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారని.. అందుకే తాను ప్రియాంక ఆహ్వానించినట్లుగా తేనీటి విందుకు రాలేనని చెప్పారు. అందుకు భిన్నంగా తమ ఇంటికే ప్రియాంక కుటుంబాన్ని తమ ఇంటికి డిన్నర్ కు రావాలని ఆహ్వానించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇన్విటేషన్ కు తనదైన రీతిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడి రిప్లై ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Next Story