రాజస్థాన్ రాజకీయ తాజా పరిస్థితి ఏమిటి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 July 2020 8:08 AM GMT
రాజస్థాన్ రాజకీయ తాజా పరిస్థితి ఏమిటి?

Rajasthan Politics Update గడిచిన కొద్ది రోజులుగా దేశ ప్రజల్ని ఆకర్షిస్తున్న రాజస్థాన్ రాజకీయ కలకలం ఇంకా ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిందే. ఓపక్క కరోనాతో ప్రజలు విలవిలలాడుతుంటే.. మరోవైపు ప్రభుత్వానికి వణుకు పుట్టేలా అసమ్మతి నేత సచిన్ పైలెట్ దెబ్బకు అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం వణుకుతుంది. ఎత్తులు.. పైఎత్తులతో ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఒకరు.. ఏదోలా ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని అసమ్మతి నేతలు పోటాపోటీగా వ్యూహరచనలు చేస్తున్నారు.

న్యాయస్థానాల నుంచి తాము ఆశించిన ఫలితాలు రాని నేపథ్యంలో గహ్లోత్ ప్రభుత్వం నిరాశకు గురైంది. అలా అని డీలా పడకుండా.. ప్రభుత్వాన్నికాపాడేందుకు ఉన్నఅవకాశాల్ని అస్సలు వదిలిపెట్టటం లేదు. తాజాగా సమావేశమైన కేబినెట్.. కొత్త ఎత్తుకు తెర తీసింది. ఈ నెల 31 నుంచి అసెంబ్లీ సమావేశాల్ని ప్రారంభించాల్సిందిగా కోరుతు గవర్నర్ కల్ రాజ్ మిశ్రాకుతాజాగా ప్రతిపాదనల్ని పంపింది.

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి అంశంపై చర్చతో పాటు.. రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చను అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ కు పంపిన నోట్ లో పేర్కొన్నారు. అయితే.. గవర్నర్ కు పంపిన నోట్ లో ప్రభుత్వ విశ్వాస పరీక్ష అంశం ఉందా? లేదా? అన్నది బయటకు రావటం లేదు. అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాలంటూ రాజ్ భవన్ ఎదుట ఎమ్మెల్యేలు ధర్నా చేసిన నేపథ్యంలో గవర్నర్ కు నోట పంపటం గమనార్హం.

తాము పంపిన నోట్ కు రాజ్ భవన్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంపై కాంగ్రెస్ విమర్శలకు దిగింది. కేంద్రం ఒత్తిడి కారణంగానే ఇలాంటివి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. కేబినెట్ సిఫార్సు ప్రకారం గవర్నర్ నడుచుకోవాలని.. అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. రాజ్ భవన్ ఆలోచన మరోలా ఉంది. ఇప్పుడున్నది సాధారణ పరిస్థితి ఎంతమాత్రం కాదని.. కరోనా టైంలో అసెంబ్లీ సమావేశాలకు ఓకే చెబితే.. వైరస్ వ్యాప్తి చెందితే ఎలా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

జులై 1 నుంచి యాక్టివ్ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని.. వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టే చర్యల్ని తీసుకోవాలని గవర్నర్ కార్యాలయం కోరుతోంది. అసెంబ్లీని సమావేశపరిచే అంశం రాష్ట్ర ప్రభుత్వానికి.. గవర్నర్ కు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటుందా? అన్నదిప్పుడు అనుమానం మారినట్లు చెబుతున్నారు. ఏమైనా.. రాజస్థాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అసమ్మతి పోటు అంత త్వరగా పోయే అవకాశం కనిపించట్లేదని చెప్పక తప్పదు.

Next Story