సోనియా, రాహుల్‌ల నోట.. పీవీ ప్రశంస మాట..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  25 July 2020 9:11 AM GMT
సోనియా, రాహుల్‌ల నోట.. పీవీ ప్రశంస మాట..!

కాంగ్రెస్‌ అధిష్ఠానంగా చక్రం తిప్పుతున్న సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ చాలా ఏళ్ల తర్వాత దివంగత నేత మాజీ పీఎం పీవీ నరసింహరావు జయంతి వేడుకలు ఏడాది పొడుగునా నిర్వహించాలని నిర్ణయించుకున్న తెలంగాణ పీసీసీని అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. పీవీ నరసింహరావును ఏనాడు ఓ అధినేతగా గుర్తించడానికి మనసొప్పని గాంధీ కుటుంబానికి ఉన్నట్టుండి ఆయనపై ప్రేమ పుట్టుకురావడం ఆశ్చర్యమే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశంపై ప్రముఖ టీవీ ఛానెల్‌ ఎన్డీటీవీ తన వెబ్‌సైట్‌ లో ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం...

తాజాగా గాంధీ కుటుంబం నుంచి అభినందన ఉత్తరాలు రావడం రాజకీయ ప్రాధాన్యమున్న ఓ అరుదైన ఘటనగా చాలా మంది భావిస్తున్నారు. పీవీ జయంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్న ఉత్తరాలు ఎందుకిలా చర్చనీయంగా మారుతున్నాయంటే.. పీవీ తన రాజకీయప్రస్థానంలో 1990లో చాలా వరకు గాంధీ కుటంబ ఉదాసీనతనే ఎదుర్కొన్నారు. 1991 లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దరిమిలా ఈ ఉదాసీన పరిణామాలు మొదలయ్యాయని చెప్పవచ్చు.

కొన్ని దశాబ్దాలుగా ప్రధాని పదవిని వారసత్వంగా అనుభవించిన నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి కాకుండా తొలిసారి బైట వ్యక్తిగా ప్రధాని పదవి అలంకరించింది పీవీ నరసింహరావే. రాజకీయంగా అరుదైన సందర్భంలో పీవీ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టినపుడు దేశంలో అంతా అనిశ్చితమే. అసలు ఆయన ప్రధాని పదవి ఎంతకాలం దాకో అన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే తన మితభాషిత్వం, లోతైన పరిశీలన, అపార రాజకీయ అనుభవాలతో పీవీ ప్రధానిగా అయిదేళ్ళ పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారు.

‘రాష్ట్ర,కేంద్ర రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ప్రయాణం చేశాక పీవీజీ దేశ ప్రధాని అయ్యారు. దేశ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో, పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పీవీ చాలా చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో దేశం దుర్భర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. అయితే పీవీ సమర్థ నాయకత్వంలో దేశం ప్రతి సవాలును దీటుగా అధిగమించగలిగింది. 1991 జులై 24న ప్రవేశ పెట్టిన యూనియన్‌ బడ్జెట్‌ పలు ఆర్థిక సంస్కరణలకు రాచబాట వేసింది.’ అంటూ సోనియా గాధి తన ఉత్తరంలో పేర్కొన్నారు.

సోనియా గాంధీ స్వర్గీయ పీవీ నరసంహారావు దేశ ఆర్థిక పరిస్థితుల్ని సమూలంగా మార్చిన సంస్కర్తగా బహిరంగంగా ప్రశంసించడం ఇదే మొదటి సారి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ముందుగానే పీవీ పాలనా దక్షతను ప్రశంసించారు. అయితే పీవీ నిబద్ధత కలిగిన జాతీయ నేతగానే పేరుపొందారు. ఆయన ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలకకపోవడం గమనార్హం.

1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు, ఆర్థికశాఖామాత్యుడు మన్మోహన్‌ సింగ్‌లు ఇద్దరూ జట్టు కట్టి పట్టాలు తప్పిపోతున్న దేశ ఆర్థిక పరిస్థితిని మళ్లీ పట్టాలపై పెట్టగలిగారు. దీని కోసం వారు విశ్వప్రయత్నం చేశారు. పలు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. దిగుమతి సుంకాల తగ్గింపు, తక్కువ పన్ను విధింపు, వీలైనంత అధికంగా విదేశీ పెట్టుబడులు ఇతర పలు విధానాలు , కొత్త మార్గాలు అవలంభించారు. వాటి ఫలితాలు మిలీనియం ముగింపు దశలో సుస్పష్టంగా కనిపించాయి. అప్పట్నుంచి భారత్‌ ఆకాశమే హద్దుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది.

1991–96 వరకు పీవీ ప్రధానిగా పాలనా పగ్గం చేపట్టిన కాలంలో కాంగ్రెస్‌ లో తన రాజకీయ జీవితం ఎన్నో ఒడుదొడుకుల్ని ఎదుర్కొందే తప్ప సాఫీగా నల్లేరుపై బండిలా సాగిపోలేదు. పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాల వల్లే 1996 ఎన్నికల్లో ఓటమి పాలైందని రాజకీయ విమర్శకుల వాదన. ఈ సాధారణ ఎన్నికలు పీవీని రాజకీయంగా కాస్త దెబ్బతీశాయనే చెప్పవచ్చు. పీవీ పాలనా సమయంలోనే 1992లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాబ్రీమసీద్‌ కూల్చివేత ఘటన చోటుచేసుకుంది. అయతే పీవీ ఆ సమయంలో మౌనమునిలా ఉండక కాస్త ప్రయత్నించి ఉంటే బాబ్రీమసీద్‌ కూల్చివేత దుర్ఘటన జరిగి ఉండేది కాదని విమర్శకులం టున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 96 ఎన్నికల్లో తమ ఓటమికి పీవీ అసమర్థపాలనే కారణమని కాంగ్రెస్‌ నేతలే బాహటంగా విమర్శలకు దిగడం దురదృష్టం. పీవీనరసింహరావు తన 83వ ఏట 2004లో స్వర్గస్థులయ్యారు.

పీవీ జయంతి వేడుకల సందర్భంగా రాహుల్‌ గాంధీ టీపీసీసీకి రాసిన ప్రశంసా ఉత్తరంలో ‘ ఈ రోజు (జులై 24), భారతదేశం నూతన ఆర్థికసంస్కరణల బాటలో సాహసంతో దూసుకుపోతోంది. శ్రీ పీవీ నరసింహరావు, డా.మన్మోహన్‌ సింగ్‌లు సంయుక్తంగా ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ వేడుకలు మన దేశయువతలో కొత్త ఆలోచనలు తేవాలి. దేశం సుదృఢ ఆర్థిక వ్యవస్థగా మారిన కథనాలు వారు తెలుసుకోవాలి. సంస్కరణలు అన్వేషించి అమలు చేసిన ఆ మహనీయుల నుంచి ప్రేరణ పొందాలి.’ అని తెలిపారు.

పీవీ నరసింహారావు తెలంగాణ గడ్డ ముద్దుబిడ్డగానే కాదు ఈ దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగిన జీవనగాధ కూడా మనకు ప్రేరణనిచ్చేదే. బహుభాషా కోవిదుడిగా, అద్భుత సాహితీవేత్తగా, మితభాషిగా, పాలనా దక్షుడిగా బహుకోణాల్లో కనిపించే విశిష్ఠ వ్యక్తి స్వర్గీయ పీవీ నరసింహారావు.

Next Story