చైనాను వదిలేసి.. భారత్ కు దగ్గరవుతున్న సౌదీ.. ఎందుకు?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2020 7:35 AM GMTగతానికి భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సమీకరణాలు మారుతున్నాయి. ఒకప్పుడు చైనాకు సన్నిహితంగా ఉండే దేశాలు ఇప్పుడు భారత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ మాటకు వస్తే.. చైనాతో తమకున్న సంబంధాలు తగ్గించుకుంటున్న పలు దేశాలు.. భారత్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా ఉన్న దేశంగానే కాదు.. వ్యాపారపరంగా భారత్ ప్రతి దేశానికి చక్కటి మార్కెట్ అన్న విషయం తెలిసిందే.
చైనాతో పోలిస్తే.. పరిమితులు తక్కువగా ఉండటం.. రాజకీయంగా పెద్దగా ఇబ్బందులు లేకపోవటం ఒక కారణంగా చెప్పొచ్చు. దీనికి తోడు కరోనా తర్వాత ప్రపంచ దేశాలు చైనా మీద ఆగ్రహంతో ఉన్నాయి. తామిప్పుడు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులకు చైనానే కారణమని వారు భావిస్తున్నారు. కరోనా తర్వాత పలు విదేశీ కంపెనీలు చైనాకు గుడ్ బై చెప్పేసి.. ఆసియాలోని ఇతర దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఇందులో భాగంగా భారత్ కు పలు కంపెనీలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయంగా ఒకకొత్త పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాలం చైనాకు సన్నిహితంగా ఉండే సౌదీ అరేబియా.. తాజాగా భారత్ వైపు మొగ్గుచూపుతోంది. ఎందుకిలా? అంటే.. రాబోయే రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలే ఇందుకుకారణమని చెబుతున్నారు. సౌదీ బలం మొత్తం చమురన్నవిషయం తెలిసిందే. దాని తర్వాత పర్యాటకం. ఎప్పుడైతే చమురుకు డిమాండ్ తగ్గుతుందో.. ఆ దేశం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవటం ఖాయం. మరోవైపు ఆయిల్ మీద ఆధారపడటం అంతకంతకూ తగ్గించే దిశగా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
అదే జరిగితే.. సౌదీకి ఇబ్బందే. అందుకే.. ఆయిల్ అమ్మకాల మీద ఆధారపడి బతికే కన్నా.. ఇతర వ్యాపారాల మీద ఫోకస్ పెట్టటం ద్వారా.. దేశానికి ఎదురయ్యే ఆర్థికముప్పు నుంచి తప్పించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. భారత్ లోని తన మార్కెట్ ను పెంచుకోవటానికి వీలుగా సౌదీ వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేస్తుంది. భారత్ తో సంబంధాలు పెంచుకోవటం ద్వారా.. రాబోయేరోజుల్లో వచ్చే ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టాలన్నదే సౌదీ యోచనగా చెప్ప తప్పదు.