అగ్రరాజ్యమా? ఇదేం నిర్ణయం?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 9:53 AM GMT
అగ్రరాజ్యమా? ఇదేం నిర్ణయం?

షాకింగ్ వ్యాఖ్య చేశారు అమెరికా అంటువ్యాధుల నిపుణుల ఉన్నతాధికారి ఆంథోనీ ఫౌచీ. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ విడుదల తర్వాత.. దాన్ని అందరికి వేస్తామన్న విషయంలో ఆయన ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ వచ్చాక.. అమెరికాలోని సామాన్యులకు దాన్ని తప్పనిసరి చేయబోమని ఆయన పేర్కొనటం విస్మయానికి గురి చేస్తోంది. పిల్లలతో పాటు మరికొన్ని గ్రూపులకు తప్పనిసరిగా వేసే వెసులుబాటు స్థానిక ప్రభుత్వాలకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా అన్నంతనే స్వేచ్ఛాయుత దేశమన్నది తెలిసిందే. అంత మాత్రానికి.. కరోనా లాంటి డేంజర్ వైరస్ విషయంలో ప్రభుత్వానికి కచ్ఛితమైన నిర్ణయాన్ని తీసుకోవాలే తప్పించి.. ఆప్షన్ ఇవ్వటంలో అర్థం లేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చినంతనే తమ దేశ ప్రజలందరికి అందిస్తామని ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ అయితే.. తమ దేశం మొత్తానికి దీన్ని తప్పనిసరి చేస్తామన్న వేళ.. అందుకు భిన్నంగా ఫౌచీ మాట ఉండటం గమనార్హం.

అందుకు భిన్నంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం.. వ్యాక్సిన్ అందరికి తప్పనిసరి కాదని.. వారి ఆప్షన్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్ తప్పనిసరి అని.. దాన్ని తీసుకోవాలని ఎవరిని బలవంతం చేయకూడదని.. తాము అలా ఎప్పుడూ చేయలేదని ఫౌచీ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ను బలవంతంగా ఇవ్వకూడదని.. ఇది తమ పద్దతి కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు.

కరోనా నేపథ్యంలో.. సరైన విధివిధానాల్ని పాటించకుండా.. మాస్కును ధరించే విషయంలో పెడసరపు వాదనను వినిపించటం ద్వారా.. అమెరికన్లు ఎంతలా నష్టపోయారో తెలిసిందే.ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా ఇంత భారీగా ఒక అంశంలో సాధారణ పౌరులు మరణించింది లేదు. ఇప్పటివరకు కరోనా కారణంగా 56.8లక్షల మంది దాని బారిన పడితే.. 1.75లక్షల మంది మరణించారు. ఇంత భారీగా అమెరికన్లను పోగొట్టుకున్న తర్వాత కూడా వ్యాక్సిన్ అందరికి ఇవ్వమని చెప్పటంలో అర్థముందా? అన్నది క్వశ్చన్.

ఆ మధ్య వ్యాక్సిన్ ఉచితంగా దేశ ప్రజలకు అందిస్తామని దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒక వైపు ట్రంప్ నోటి నుంచి వ్యాక్సిన ఉచితం అన్న మాట వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఫౌచీ మాత్రం.. తాము తప్పనిసరి చేయమన్న వాదన అర్థం లేదంటున్నారు. అగ్రరాజ్యానికి శాపంగా మారిన కరోనా నుంచి వీలైన్ని జాగ్రత్తగా బయటపడాలన్న ఆలోచన చేయటం మానేసి.. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయటం ఏ విధంగా లాభిస్తుందన్నది అసలు ప్రశ్న. అందుకే.. ఫౌచీ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. అమెరికా ఏం చేస్తుందో చూడాలి.

Next Story