తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త
ఎండలకు తాళలేకపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నాయి
By Medi Samrat
ఎండలకు తాళలేకపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నాయి. ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మే 20వ తేదీ తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని అధికారులు చెబుతూ ఉన్నారు. దక్షిణ అంతర్భాగ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కేరళ నుంచి కర్ణాటక మీదుగా మరఠ్వాడా వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ద్రోణితో విలీనమైంది. అదే సమయంలో రాష్ట్రంపై ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అవర్తనం ఏర్పడిందని.. వాతావరణం చల్లబడటంతోపాటు రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. మే 17 వరకు తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణ పేట జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.