రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, ఇది రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

By Medi Samrat
Published on : 2 Sept 2025 9:15 PM IST

రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, ఇది రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆతదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. దీని ప్రభావంతో

• రేపు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

• విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 88.7మిమీ, వజ్రపుకొత్తూరులో 80.7మిమీ, పలాసలో 70.5మిమీ, రావివలసలో 56.5మిమీ, మదనపురంలో 53.5మిమీ, హరిపురంలో 53మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందని పేర్కొన్నారు.

సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 41.3 అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.72 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినట్లు తెలిపారు. కృష్ణానది ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 5 గంటలకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,52,772 క్యూసెక్కులు ఉందన్నారు. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

Next Story