ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న‌.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

Rain Alert For Andhra Pradesh. నిన్న బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డిన‌ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతం,

By Medi Samrat  Published on  5 Sept 2021 2:51 PM IST
ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న‌.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

నిన్న బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డిన‌ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని వున్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్ది నైఋతి దిశ వైపుకు వంగి కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల‌ రాగల 24 గంటలలో ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని వున్న మధ్య బంగళాఖాతంలలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది.

దీని ప్రభావం వలన ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తీరం వెంబడి ఈదురుగాలులు 40-50 కీ.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రా జిల్లాలైన‌ కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుండి అతిభారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో కూడా ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అనంతపురం కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.


Next Story