దంచికొడుతున్న ఎండ‌లు.. శుభ‌వార్త చెప్పిన ఐఎండీ

40 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో మరో రోజు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్రమైన వేడితో అల్ల‌డిల్లిపోయారు.

By Medi Samrat  Published on  31 May 2024 3:45 PM GMT
దంచికొడుతున్న ఎండ‌లు.. శుభ‌వార్త చెప్పిన ఐఎండీ

40 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో మరో రోజు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్రమైన వేడితో అల్ల‌డిల్లిపోయారు. ఈ నేప‌థ్యంలోనే ఐఎండీ-హైద‌రాబాద్ కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించే శుభ‌వార్త చెప్పింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఐఎండీ హైదరాబాద్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు హెచ్చరిక జారీ చేసింది.

నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు జోగులాంబ గద్వాల్ సహా వివిధ జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు (30-40 కి.మీ./గం) కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది.

జూన్ ప్రారంభంలో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచ‌నా వేసింది. జూన్ మొదటి వారంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలావుంటే.. శుక్రవారం హైద‌రాబాద్‌ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని IMD-హైదరాబాద్ తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) డేటా ఆధారంగా.. నగరం అంతటా ఉష్ణోగ్రతలు 40 నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి. ముషీరాబాద్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్, సికింద్రాబాద్,అంబర్‌పేటలో 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. పెద్దపల్లి, మంచిర్యాలలో 47.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో 46 డిగ్రీలు దాటిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలోని దాదాపు 15 జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Next Story