పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. తమిళనాడు రాజధాని చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, పుదుచ్చేరి నుండి తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లుగా భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపు తెల్లవారుజామున తీరం దాటే ఛాన్స్ ఉంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ, రేపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడులో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదు అయ్యినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.