తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మంగళవారం నుంచి వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉందని.. ఈ రెండింటీ ప్రభావంతో మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు
ఏపీలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కళితో పాటుగా కాకినాడ జిల్లాలోని ఉత్తర భాగాల్లో కూడ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.